అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్! | Borrow Until You Die Says Robert Kiyosaki | Sakshi
Sakshi News home page

అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్!

Jul 25 2026 6:00 PM | Updated on Jul 25 2026 6:12 PM

Borrow Until You Die Says Robert Kiyosaki

అప్పు చేసినవాళ్లలో.. చాలా మంది వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుల ఊబి నుంచి బయటకు రావడమే ఆర్థిక స్వేచ్ఛ అని భావిస్తారు. కానీ, కోటీశ్వరులు ఎప్పుడూ అలా ఆలోచించరు. ఈ కారణంగానే సామాన్యులు ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతున్నారని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.

బ్యాంకులు, ప్రభుత్వాలు, మన విద్యా వ్యవస్థలు ఎప్పుడూ చెప్పని కొన్ని ఆర్థిక రహస్యాలను కియోసాకి వెల్లడించారు. నిజానికి మన ఆర్థిక వ్యవస్థలో డబ్బు అనేది అప్పుల ద్వారానే సృష్టించబడుతుంది. ఒకవేళ ఎవరూ అప్పు చేయకుండా.. పూర్తిగా అప్పు లేని జీవితాన్ని గడపాలని చూస్తే.. వారు ఈ ఆర్థిక వ్యవస్థ వెలుపల బతుకుతున్నట్టే లెక్క.

అమెరికా జాతీయ అప్పు నేడు 40 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రభుత్వం కూడా అప్పుల మీదే నడుస్తోంది. అప్పుల్లేని వ్యవస్థ ఈ ప్రపంచంలో మనుగడ సాగించలేదు. మరి అలాంటప్పుడు, ప్రపంచంలోని అత్యంత ధనిక ప్రభుత్వమే అప్పులతో నడుస్తున్నప్పుడు.. సామాన్యులైన మనల్ని మాత్రం 'అప్పుల జోలికి వెళ్లొద్దు' అని ఎందుకు భయపెడతారు? ఇక్కడే అసలు రహస్యం ఉంది.

ధనవంతులు అప్పును ఎలా వాడుకుంటారు?
ఆర్థిక అవగాహన లేని వ్యక్తి అప్పు చేసి కార్లు, విహారయాత్రలు, బట్టలు వంటివి కొనుక్కుంటాడు. దీనివల్ల అతని జీవితం మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి పడిపోతుంది. అదే.. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న ధనవంతుడు అప్పును రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, లేదా నిలకడగా ఆదాయాన్నిచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాడు.

ఇక్కడ అసలు మ్యాజిక్ ఏమిటంటే.. అప్పును ధనవంతుడు స్వయంగా కట్టడు. అద్దెలు కట్టే కిరాయిదారులు లేదా వ్యాపారంలో వచ్చే సంపాదన ద్వారా ఆ అప్పు తీరిపోతుంది. ఎప్పుడైతే అప్పు మీ కోసం పనిచేసి, మీకు డబ్బు తెచ్చిపెడుతుందో.. అప్పుడే అది సంపదను సృష్టించే ఒక మిషన్ మాదిరిగా మారుతుందని కియోసాకి చెబుతారు.

ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. మనం చేసే అప్పు మీద ఎలాంటి పన్ను ఉండదు. మీరు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా, కోటి రూపాయలు తీసుకున్నా ఆదాయపు శాఖ దానిపై పన్ను వసూలు చేయలేదు.

Loading post...

అందుకే ధనవంతులు ''తమ దగ్గరున్న ఆస్తులను (Assets) బ్యాంకులో పెట్టి అప్పు తీసుకుంటారు. ఆ డబ్బుతో మరిన్ని కొత్త ఆస్తులను కొంటారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే అద్దెలు లేదా ఆదాయంతోనే అప్పును కట్టిస్తారు. ఆస్తిని ఎప్పటికీ అమ్మరు (అమ్మితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి). ఆస్తిని అమ్మకుండా కేవలం దానిపై మళ్లీ మళ్లీ లోన్లు తీసుకుంటూ పన్ను లేని నగదును పొందుతారు''.

ధనవంతుల ఆర్థిక రహస్యం
చివరికి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ ఆస్తులు వారసులకు బదిలీ అవుతాయి. అప్పుడు పన్ను భారం పూర్తిగా తొలగిపోతుంది. ఇది పూర్తిగా చట్టబద్ధమైన, అత్యంత సులభమైన వ్యూహం. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి ఇదే అసలు రహస్యం.

అప్పు తీసుకోవడం అనేది ప్రమాదకరమైన విషయం కాదు. అయితే ఏ విధమైన అప్పు తీసుకుంటున్నామనేదే ముఖ్యం. మీ జేబు నుంచి డబ్బులు తీసి అప్పు కడితే అది 'చెడ్డ అప్పు' (ఉదాహరణకు: క్రెడిట్ కార్డు బిల్లులు, కారు లోన్). అలా కాకుండా.. వేరే వాళ్లు (కిరాయిదారులు లేదా కస్టమర్లు) మీ అప్పును తీరుస్తుంటే అది 'మంచి అప్పు'.

అయితే కోటీశ్వరులు అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. రిస్క్ తీసుకోకుండా ఎప్పుడూ ఫిక్స్డ్ వడ్డీ రేట్లను మాత్రమే ఎంచుకుంటారు, తగినంత డబ్బును రిజర్వ్‌లో ఉంచుకుంటారు. నిపుణుల సలహాలతో అప్పులను నిర్వహిస్తారు.

మొత్తానికి అప్పు అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడితే మిమ్మల్ని ధనవంతుణ్ణి చేస్తుంది, లేదంటే ముంచేస్తుంది. కాబట్టి, ఆర్థికంగా ఎదగాలంటే.. అప్పు లేకుండా బతకాలి అనే పాత పద్ధతిని పక్కన పెట్టి, అప్పులను తెలివిగా ఎలా వాడాలో నేర్చుకుంటే ధనవంతులు అవుతారు.

ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాల్.. సెక్షన్ 301తో దర్యాప్తు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement