కియోసాకికి కోపమొచ్చింది.. ‘పందులకు ఎంత చెప్పినా వేస్టే’ | Robert Kiyosaki says Dont teach pigs It wastes time | Sakshi
Sakshi News home page

కియోసాకికి కోపమొచ్చింది.. ‘పందులకు ఎంత చెప్పినా వేస్టే’

Jul 20 2026 1:48 PM | Updated on Jul 20 2026 3:01 PM

Robert Kiyosaki says Dont teach pigs It wastes time

ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి డబ్బు, ఆర్థిక విద్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X)వేదికగా చేసిన తాజా పోస్టులో, "నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించడానికి ప్రయత్నించడం సమయ వృథా" అని పేర్కొన్నారు.

"పందికి పాటలు నేర్పొద్దు. అది మీ సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పందిని కూడా చిరాకు పెడుతుంది" అనే సామెతను ఉదహరిస్తూ, జీవితంలో తాను నేర్చుకున్న అత్యంత కఠినమైన పాఠాల్లో ఇదొకటని కియోసాకి చెప్పారు. తాను ఎక్కువ మందికి డబ్బు గురించి అవగాహన కల్పించి, వారిని ఆర్థికంగా బలంగా, స్వేచ్ఛగా చూడాలనుకున్నప్పటికీ, చాలామంది తన సలహాలను అంగీకరించరని వెల్లడించారు.

డబ్బు అనేది వ్యక్తిగతం, భావోద్వేగాలతో కూడుకున్నది, కుటుంబ విలువలు, సంస్కృతితో ముడిపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పెరిగిన వారిలో డబ్బుపై స్థిరమైన అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో తన సలహాలు వారికి ఇబ్బందిగా అనిపిస్తాయని వ్యాఖ్యానించారు.

"నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే నా పోస్టులను చదువుతూ, డబ్బు గురించి మరింత తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని కియోసాకి తెలిపారు.

అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు మరింత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. చైనా ఎదుగుదల, అమెరికా ఆర్థిక పరిస్థితి, కృత్రిమ మేధ (AI) కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఆర్థిక విజ్ఞానం పెంపొందించుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో మరింత అవసరమని ఆయన తన పోస్టులో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement