సాంకేతిక దిగ్గజం గూగుల్ తన యూజర్ల డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు సరికొత్త అప్‌డేట్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘ఆండ్రాయిడ్ ఆటో’ వేదికగా గూగుల్ మ్యాప్స్‌లో ‘లైవ్ స్పీడోమీటర్’ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ యాక్సెస్ ఇవ్వనున్నారు.
ప్రయాణ వేగంపై స్పష్టమైన నిఘా
సాధారణంగా మొబైల్ స్క్రీన్‌లపై గూగుల్ మ్యాప్స్ వాడుతున్నప్పుడు వాహనం వెళ్లే వేగాన్ని చూపే సదుపాయం ఇప్పటికే ఉంది. అయితే, కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆండ్రాయిడ్ ఆటోకు అనుసంధానించినప్పుడు ఈ లైవ్ స్పీడ్ డిస్‌ప్లే కనిపించేది కాదు. తాజా అప్‌డేట్‌తో కారు డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పైనే నావిగేషన్‌తో పాటు వాహనం ఎంత వేగంతో దూసుకెళ్తుందో స్పష్టంగా గమనించవచ్చు. ఇది వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లోని స్పీడ్ లిమిట్స్‌ను దాటకుండా అలర్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.
ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి?
1. మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో Google Maps యాప్‌ను ఓపెన్ చేయాలి.
2. స్క్రీన్ పైభాగంలో కుడి వైపున ఉండే Profile Iconపై క్లిక్ చేసి Settingsలోకి వెళ్లాలి.
3. సెట్టింగ్స్ మెనూలో Navigation Settings ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. కిందకు స్క్రోల్ చేసి Driving Options విభాగంలోకి వెళ్తే అక్కడ Speedometer అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని On (ఎనేబుల్) చేసుకోవాలి.
ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీ ఫోన్‌ను ఆండ్రాయిడ్ ఆటో ద్వారా కారుకు కనెక్ట్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ స్క్రీన్‌పై ఎడమ వైపు కింద భాగంలో వాహనం ప్రస్తుత వేగం స్పష్టంగా కనిపిస్తుంది.
భద్రతతో కూడిన స్మార్ట్ డ్రైవింగ్
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఆటో 12.4 లేదా అంతకంటే తాజా బీటా వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉంది. వేగ పరిమితులను సూచించే Speed Limits ఫీచర్‌తో పాటు ఈ స్పీడోమీటర్ కూడా జతకూడటంతో మితిమీరిన వేగం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని, అలాగే ట్రాఫిక్ చలాన్ల బారిన పడకుండా ఉండొచ్చని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వినియోగదారులందరికీ స్థిరమైన అప్‌డేట్ రూపంలో అందుబాటులోకి రానుంది.
ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?


