
డ్రైవర్ అజాగ్రత్తతో 19 మందికి తీవ్ర గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
జనగామ: గూగుల్ మ్యాప్ వలస కూలీల ప్రాణాల మీదకు తెచ్చింది. మ్యాప్‌నే నమ్ముకుని డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు తీసినంత పనిచేశాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రధాన రహదారి శామీర్‌పేట బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కైలూరు మండలానికి చెందిన డ్రైవర్‌తో సహా 19 మంది మత్స్య కార్మికులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు బొలెరో వాహనంలో బయలుదేరారు. సంగారెడ్డి ప్రాంతంలో చెరువుల్లో చేపలు పట్టి, వాహనంలో లోడ్ చేసేందుకు రోజుకు రూ.1,000 వేతనం ఒప్పందంతో ఇక్కడకు వస్తు న్నారు.
కైలూరు నుంచి బయలుదేరే సమయంలో డ్రైవర్ గూగుల్ మ్యాప్‌ను మాత్రమే నమ్ముకున్నాడు. జనగామ మండలం శామీర్‌పేట బైపాస్ వద్ద మలుపు తిరిగే సమయంలో రెండువైపులా గుంతల రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గూగుల్ మ్యాప్ స్ట్రైట్ రూట్ చూపించడంతో డ్రైవర్ నేరుగా వచ్చే శాడు. దగ్గరకు వచ్చేసరికి మలుపు, పక్కనే గుంత కనిపించడంతో వేగంగా ఉన్న వాహనాన్ని అదుపు చేసే క్రమంలో బొలెరో వాహనం అందులో పల్టీ కొట్టింది. గాఢనిద్రలో ఉన్న కూలీలు బాలి మాణిక్యం, సైదు వెంకటనారాయణ, గంటసాల రాధాకృష్ణ, బాలె హరినాథ్, గంటసాల వెంకన్న, ఇమ్మాన్యు యేల్, బాలె రవికుమార్, గంటసాల రేణుక, గంటసాల సాయి, ముంగర సత్యనారా యణ, కె.ఏసోబు, సైదు హరిశ్చంద్ర, నడుగారి ఆదేశ్, నబిగర్ నాగరాజు, సైదు వెంకటనారాయణ, ఏదూరి నల్లయ్య, బాలె మాణిక్యం, బాలె రవికుమార్, బాలె మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో హరిశ్చంద్ర, సత్యనారాయణ తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకోవడంతో ప్రాథమిక చికిత్స అందించి 108లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా కూలీలకు ఇక్కడే వైద్య పరీక్షలు అందిస్తున్నారు.