హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకల సమయాలు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో రియల్ టైమ్‌గా కనిపిస్తాయని తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మెట్రో సేవలకు సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం ఓపెన్, స్టాండర్డ్ జీటీఎఫ్‌ఎస్ ఫార్మాట్‌లో విడుదల చేయడంతో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఓపెన్ డేటా తెలంగాణ పోర్టల్–హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంయుక్తంగా సిద్ధం చేసిన పూర్తి జీటీఎఫ్‌ఎస్ డేటాసెట్‌లో మూడు కారిడార్లు, 118 స్టేషన్లు, వారానికి 6,958 ట్రిప్‌ల వివరాలు ఉన్నాయని మంత్రి చెప్పారు.
జీటీఎఫ్‌ఎస్ విశిష్టత ఏంటంటే.. మెట్రో షెడ్యూల్‌లో మార్పులు, ఆలస్యాలు జరిగితే అవి ఆటోమేటిక్‌గా గూగుల్ మ్యాప్స్, ఇతర యాప్‌లతో సమకాలీకరణ అవుతాయని.. దీంతో ప్రయాణికులు రియల్ టైమ్ రైలు రాకపోకల సమాచారం, మార్గాలు, స్టేషన్ వివరాలు వేగంగా తెలుసుకోగలరని ఆయన తెలిపారు. “హైదరాబాద్ నగర రవాణాలో ఇది ఒక పెద్ద మైలురాయి. ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించే కీలక నిర్ణయం’’ అని శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఓపెన్ డేటా ఆధారంగా డెవలపర్లు కొత్త ప్రయాణ ప్రణాళిక యాప్‌లు, యాక్సెసిబిలిటీ టూల్స్ రూపొందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్టీసీ నడిపే బస్సుల కోసం 50,807 వారాంత ట్రిప్‌లు, 5,920 స్టాప్‌లను కలిగిన జీటీఎఫ్‌ఎస్ డేటాసెట్ కూడా పూర్తికావచ్చిన దశలో ఉందని మంత్రి తెలిపారు. అది విడుదలైన తర్వాత మెట్రో–బస్సు ప్రయాణాల కోసం ఒకే ప్లాట్‌ఫారమ్‌లో సమగ్ర మార్గనిర్దేశం లభ్యం కానుంది. దీంతో ఫస్ట్-మైల్, లాస్ట్-మైల్ కనెక్టివిటీ మెరుగవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ చర్యలు అనుసంధానమై ఉన్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా ఉన్న హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో సుమారు 69 కిలోమీటర్లపాటు నడుస్తోందని తెలిపారు.


