
కాన్పూర్: గూగుల్ మ్యాప్స్ బృందానికి ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. గూగుల్ మ్యాప్స్ కోసం సర్వే చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా బిర్హార్ గ్రామానికి వెళ్లిన బృందంపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. అయితే, వారిని దొంగలుగా అనుమానించి గ్రామస్థులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
గూగుల్ మ్యాప్స్‌లో రహదారి సమాచారం అందించేందుకు టెక్ మహీంద్రా నుంచి ప్రత్యేకంగా కెమెరాలు అమర్చిన వాహనంతో బృందం గ్రామంలోని వీధులను మ్యాపింగ్‌కు ఫొటోలు తీశారు. అయితే, కెమెరాలు అమర్చిన వాహనాన్ని చూసిన గ్రామస్థులు అనుమానంతో.. వారు దొంగతనం చేయడానికి ముందస్తుగా సమాచారం సేకరిస్తున్నారని భావించారు. ఒక్కసారిగా గ్రామస్థుల గుంపు బృందాన్ని చుట్టుముట్టి, వాహనాన్ని అడ్డగించి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులు.. బృంద సభ్యులపై దాడికి దిగారు.
ఈ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులు, సర్వే బృందాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అక్కడ గూగుల్ మ్యాప్స్ బృందం తమ పని గురించి వివరించడంతో గ్రామస్థులు శాంతించారు. ఇదిలా ఉండగా.. తాము దొంగలం కాదని చెబుతున్నా వినకుండా తమపై దాడి చేసినట్లు సర్వే బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామాన్ని సర్వే చేసేందుకు వెళ్లామని, అందుకు డీజీపీ నుంచి అనుమతి కూడా తీసుకున్నామని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తూ.. ఇటీవల కాలంలో ఆ గ్రామంలో అధికంగా చోరీలు జరుగుతున్నాయని.. దీంతో గ్రామస్థులు.. వాహనానికి కెమెరాలు అమర్చి గ్రామంలో తిరుగుతున్న గూగుల్ మ్యాప్స్ బృందాన్ని దొంగలుగా భావించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించినట్లు పోలీసులు చెప్పారు.