
బిహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాల్లో తలమునకలయ్యాయి. సీట్ల లెక్కలు, ప్రచార పర్వంపై అధికార, విపక్ష కూటముల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రస్తుత ఎమ్మెల్యేలకు సంబంధించిన సమగ్ర నివేదికను వెల్లడించింది. 2020 ఎన్నికలు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ రిపోర్ట్ తయారు చేసింది ఏడీఆర్. బిహార్‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 241 మందికి సంబంధించిన పూర్తి డేటాను విడుదల చేసింది.
రూ. 1,121 కోట్ల ఆస్తులు
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 194 మంది అంటే 80 శాతం మంది కోటీశ్వరులు. 241 మంది శాసనసభ్యుల మొత్తం ఆస్తులు విలువ దాదాపు రూ. 1,121.6 కోట్లుగా తేలింది. బీజేపీలో 72 మంది (87 శాతం) సంపన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కమలం పార్టీకి మొత్తం 83 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆర్జేడీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 63 మంది (88 శాతం) కోటీశ్వరులు. జేడీయూ పార్టీ ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది (83 శాతం) సంపన్నులే.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న 17 మంది శాసనసభ్యుల్లో 13 మంది (76 శాతం) కరోడ్‌పతులున్నారు. హిందూస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్) పార్టీలోని నలుగురు ఎమ్మెల్లో ఇద్దరు (50 శాతం) సంపన్నులు ఉన్నారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) నుంచి ఒక్కొక్కరు చొప్పున కోటీశ్వరులు ఉన్నారు. బిహార్ శాసనసభలో ఉన్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ. 4.7 కోట్లుగా అంచనా వేసింది.
నీలం దేవి టాప్
బిహార్‌లోని అత్యంత సంపన్న శాసనసభ్యుల జాబితాలో జేడీయూ ఎమ్మెల్యే నీలం దేవి (Neelam Devi) అగ్రస్థానంలో ఉన్నారు. 2022 ఉప ఎన్నికల్లో మోకామా నియోజకవర్గం నుంచి ఆమె గెలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు రూ. 80 కోట్లుపైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ. 29.8 కోట్ల చరాస్తులు, రూ. 50.6 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సంపద విషయంలో తన తోటి శాసనసభ్యుల కంటే ఆమె చాలా ముందున్నారు. గయ జిల్లాలోని బెలగంజ్‌కు చెందిన జేడీయూ మరో మహిళా ఎమ్మెల్యే మనోరమా దేవి రెండో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.72.8 కోట్లు. భాగల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.43.2 కోట్లు.
నిరుపేద ఎమ్మెల్యే ఆయనే
ఖగారియా జిల్లాలోని అలౌలి (ఎస్సీ) ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్‌వృక్ష సదా నిరుపేద ఎమ్మెల్యే అని ఏడీఆర్ రిపోర్ట్ (ADR Report) తెలిపింది. ఆయన మొత్తం ఆస్తులు కేవలం 70,000 రూపాయలు మాత్రమే. వీటిలో రూ.30,000 చరాస్తులు, రూ.40,000 స్థిరాస్తులు ఉన్నాయి. ఫుల్వారీ (ఎస్సీ) నియోజకవర్గ సీపీఐ (ఎంఎల్) గోపాల్ రవిదాస్ (Gopal Ravidas) తదుపరి స్థానంలో ఉన్నారు. ఆయనకు రూ. 1.59 లక్షలు విలువచేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇదే పార్టీ నుంచి పాలిగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సందీప్ సౌరవ్ రూ. 3.45 లక్షల విలువైన ఆస్తులను ప్రకటించారు.
చదవండి: చెట్లకు సెల్‌ఫోన్లు.. మహిళలకు తప్పని పాట్లు
అంత వ్యత్యాసమా?
బిహార్‌లో ధనిక, పేద ఎమ్మెల్యేల మధ్య భారీ వ్యత్యాసం.. అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పడుపడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో బిహారీలకు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election) రెండు విడతల్లో.. నవంబర్ 6, 11న జరగనున్నాయి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.