
ఆ ఊర్లో చెట్లకు సెల్‌ఫోన్లు కాస్తాయి.. ఏంటి వింతగా అనిపించిందా! ఇందులో కొంచెం చేంజ్.. ఆ ఊర్లో చెట్లకు సెల్‌ఫోన్లు కడతారు. ఇలా ఎందుకు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? ఓటీపీ కోసం అని చెబితే నమ్ముతారా? అవును ఇది అక్షరాలా నిజం. ఓటీపీ కోసం ఆ ఊరి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. అంతగా ఎందుకు కష్టపడుతున్నారంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం పదండి.
అరగంట నడిచి కొండపైకి ఎక్కుతారు. తర్వాత సెల్‌ఫోన్లను చెట్లకు కట్టేసి దానికి వచ్చే ఓటీపీ కోసం ఎండలో ఎదురు చూస్తుంటారు. మహారాష్ట్రలోని ధడ్గావ్ తాలూకా ఖార్డే ఖుర్ద్ గ్రామంలోని (Kharde Khurd village) మహిళలకు ఈ తంతు నిత్యకృత్యంగా మారింది. సెల్‌ఫోన్‌లో వచ్చే ఒకే ఒక సిగ్నల్ బార్ కోసం మరాఠా మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రలోని చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.
లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. లబ్ధిదారులు రెండు నెలల్లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో మహిళలు కేవైసీ పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్ (Cell Phone Signal) లేక కష్టాలు పడాల్సివస్తోంది. రోజంతా కష్టపడినా వంద మందిలో నలుగురైదురికి మాత్రమే కేవైసీ పూర్తవుతోంది.
మహిళల అవస్థలు
ఖార్డే ఖుర్ద్ గ్రామ మహిళలకు ఉల్గులన్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సహాయం చేస్తోంది. దగ్గరలోని కొండగుట్టపై శిబిరం ఏర్పాటు చేసి కేవైసీ చేయిస్తోంది. "మేము ఇక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మొబైల్ డేటాను పట్టుకునే ఏకైక ప్రదేశం ఇదే" అని ఉల్గులన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు రాకేష్ పవారా అన్నారు. అలాగే కొండపైకి చేరుకోవడానికి మహిళలు అవస్థలు పడాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు కేవైసీ పూర్తి చేసిన అర్హులైన మహిళలకు మాత్రమే లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇబ్బందులు ఉన్నాయి.. కానీ
ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావులేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. పుణేలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "ధృవీకరించబడిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కేవైసీ నమోదులో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అవసరమైతే గడువును పొడిగించవచ్చు, కానీ పూర్తి చేయడం తప్పనిసర''ని పేర్కొన్నారు.
బలహీనంగా కనెక్టివిటీ
ప్రభుత్వం విధించిన గడువు నవంబర్ 15తో ముగుస్తుంది. అయితే ఇంటర్నెట్ నెట్‌వర్క్ సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ పూర్తిచేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ధడ్గావ్ తాలూకా తహసీల్దార్ జ్ఞానేశ్వర్ సప్కలే కూడా దీన్ని ఒప్పుకున్నారు. "మొబైల్ టవర్లు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. కానీ కనెక్టివిటీ ఇప్పటికీ బలహీనంగా ఉంది. సమస్యను పరిష్కరించమని ఆపరేటర్లను కోరాము. సాధారణ సేవా కేంద్రాలు, ఆధార్ ఆపరేటర్ల ద్వారా మహిళలకు సహాయం చేస్తున్నాము" అని ఆయన అన్నారు.
చదవండి: ఖరీదైన స్టంట్.. ట్విస్ట్ అదిరింది!
సమస్యను పరిష్కారిస్తాం
లడ్కీ బహిన్ యోజన కింద మహిళలకు సెప్టెంబర్‌లో ఆర్థిక సహాయం చేశామని, లబ్ధిదారులు మరో రెండు నెలల్లోపు ఈ- కేవైసీ పూర్తి చేయాలని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తత్కరే (Aditi Tatkare) ఇటీవల ప్రకటించారు. ఇంటెర్నెట్, ఆధార్ సమస్యలతో కేవైసీ ఆలస్యమవుతోందని మహిళలు వాపోతున్నారు. సేవా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ, డేటా సమస్యలను పరిష్కరించడానికి తన విభాగం కృషి చేస్తోందని తత్కరే హామీ ఇచ్చారు. లడ్కి బహిన్ యోజన కింద 2.5 కోట్లకు పైగా మహిళలు నమోదు చేసుకున్నారని తెలిపారు.