
ముఖ్యాంశాలు – ఆర్జేడీ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర గందరగోళం
అభ్యర్థుల చేతికి ఎల్లో కవర్లు
తేజస్వి ఎంట్రీతో మారిన సీన్
లాలూ నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామా
బీహార్ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలు నిజంగానే హైడ్రామాను తలపించాయి. రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు సీల్డ్ కవర్ల అందజేత, కొద్దిగంటలకే తిరిగి వెనక్కి తీసుకోవడం.. తీవ్ర కలకలం రేపాయి. అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అసలేం జరిగిందంటే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్ బంధన్‌లో సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంటూ జాతీయ మీడియా చానెల్స్‌లో హడావిడి నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం ఢిల్లీలో ఐఆర్‌సీటీసీ కేసు కోర్టు విచారణ అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా పాట్నాకు చేరుకున్నారు. అయితే కాసేపటికే ఆర్జేడీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది(RJD Candidates). కాసేపటికి..
లోపలికి వెళ్లిన కొందరు.. నిమిషాల తర్వాత చేతుల్లో ఎల్లో కవర్లతో(RJD Yellow Covers Drama) బయటకు వచ్చి తమ వర్గీయులతో కోలాహలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో వాళ్ల పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పత్రాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే.. కొద్దిసేపటికే లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే కవర్లు అందుకున్నవాళ్లకు మరోసారి ఫోన్లు వెళ్లాయి.
కవర్లు తీసుకెళ్లినవాళ్లు.. అర్ధరాత్రి తిరిగి లాలూ నివాసానికి చేరి వాటిని అప్పగించారు. ఎల్లో కవర్లు అందుకున్నవాళ్లలో.. జేడీయూ నుంచి తాజాగా ఆర్జేడీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాగేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో కూడా ఉన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఆర్జేడీ నేతలెవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. అష్రాఫ్ ఫాతిమా మాత్రం తాము ఎలాంటి కవర్లు అందుకోలేదని, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలు అని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిందనేది తాజా సమాచారం. మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుందని, కాంగ్రెస్ 70 స్థానాల్లో, ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్‌సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయింపు జరిగిందనేది ఆ కథనాల సారాంశం. బీహార్ ఫస్ట్ ఫేస్‌కు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. నవంబర్ 6న పొలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ 11వ తేదీన జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్.. ఆరోజే ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్