
ముఖ్యాంశాలు – మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు
- ఆర్జేడీ తగ్గింపు, కాంగ్రెస్ పెంపు
- VIP, వామపక్షాలకు స్థానం
- CM అభ్యర్థిత్వంపై వ్యూహాత్మక మౌనం
కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(RJD) మిత్రపక్షం కోసం కాస్త దిగొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీహార్ ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కోరుకున్న సీట్లకు కేటాయించడంతో మహాఘట్ బంధన్‌లో సీట్ల కేటాయింపు సస్పెన్స్‌కు దాదాపుగా తెర పడినట్లేనని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి(Bihar Seats Sharing).
మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించింది. అయితే సర్దుబాటు నేపథ్యంలో ఇప్పుడు 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ తొలుత 61 స్థానాలను కేటాయిస్తారనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడు 70 స్థానాల్లో పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కూటమిలో భాగమైన ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్‌సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక..
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అని బహిరంగంగా చెప్పేశాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టుకు సంబంధించిన అంశమేదీ మహాఘట్ బంధన్‌లో చర్చకు రాలేదని సమాచారం. అంతకు ముందు..
బీహార్‌లో ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ 70 స్థానాలు తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఒకవైపు రాహుల్ గాంధీ సమక్షంలోనే తాను సీఎం అభ్యర్థినంటూ తేజస్వి యాదవ్ ప్రకటించినా.. సీట్ల డిమాండ్‌ను నేరవేర్చుకునేందుకే కాంగ్రెస్ ఆ అంశంపై సైలెంట్‌గా ఉంటూ వచ్చింది. ఇంకోవైపు..
బీహార్ మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాన్ని ఇరకున పడేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ(IIP) విపక్షాలతో చేతులు కలిపాయి. దీంతో.. ఎనిమిది పార్టీలకు ఈ కూటమి విస్తరించింది. అదే సమయంలో వీఐపీ పార్టీ అధినేత ముకేశ్ సాహ్ని.. 50 స్థానాలు+ఉపముఖ్యమంత్రి డిమాండ్ చేయడంతో సీట్ల పంపకంలో జాప్యం జరిగింది. చివరకు 16 పార్టీలకు సాహ్ని ఒప్పుకోగా.. ఆర్జేడీ తన కోటా నుంచి జేఎంఎంకు, కాంగ్రెస్ తన కోటా నుంచి IIP పార్టీకి స్థానాలు కేటాయించేందుకు అంగీకరించడంతో.. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లైంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. మొత్తం 243 స్థానాలకుగానూ.. 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ కాగా.. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో నవంబర్ 6న, రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. ఓట్లు లెక్కించే తేదీ నవంబర్ 14.
ఇదీ చదవండి: లాలూ కుటంబానికి భారీ షాక్