ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో కోర్టులో అభియోగాలు
లాలు కనుసన్నల్లోనే కుట్ర: కోర్టు
మేం నిర్దోషులం: కోర్టులో లాలు, రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌సీటీసీ హోటళ్ల అవినీతి కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవి, కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు ఇతర నిందితులపై అభియోగాలను ఖరారు చేసింది.
వీరంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, నిందితుల పాత్ర ఆధారంగా న్యాయస్థానం వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. ముఖ్యంగా రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు మోపింది. అయితే నిందితులందరిపై నేరపూరిత కుట్ర అభియోగం ఉమ్మడిగా ఉంది. తమపై మోపిన ఆరోపణలను లాలు కుటుంబం ఖండించింది. తాము నిర్దోషులమని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘టెండర్ కుంభకోణానికి సంబంధించిన పూర్తి కుట్ర లాలు ప్రసాద్ యాదవ్‌కు తెలిసే జరిగింది. టెండర్ ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఈ కుట్ర ద్వారా లాలు కుటుంబం లబ్ధి పొందింది. రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమి లభించింది’అని పేర్కొంది. కోర్టు లాలు యాదవ్‌ను ఉద్దేశించి, ‘మీరు మీపై మోపిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా? లేక విచారణను ఎదుర్కొంటారా?’అని ప్రశ్నించగా, ‘ఈ ఆరోపణలన్నీ అవాస్తవం’అని లాలూ యాదవ్ బదులిచ్చారు. అదేవిధంగా, రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లు కూడా తాము ఏ కుట్రలో, మోసంలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు.
ఏంటీ కుంభకోణం?
2004– 2009 మధ్యకాలంలో లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. సీబీఐ ఆరోపణల ప్రకారం, రాంచీ, పూరీలలో ఉన్న ఐఆర్‌సీటీసీకి చెందిన రెండు బీఎన్‌ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను ‘సుజాత హోటల్స్’అనే ప్రైవేట్ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాంట్రాక్టుకు ప్రతిఫలంగా, లాలు కుటుంబానికి పట్నాలోని అత్యంత విలువైన భూమిని సుజాత హోటల్స్ యజమానులు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. 2017 జూలై 17న సీబీఐ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
#WATCH | Delhi: RJD leader Tejashwi Yadav leaves from the Rouse Avenue Court.
The Rouse Avenue court framed charges against former Railway Minister Lalu Prasad Yadav, former Bihar CM Rabri Devi, RJD leader Tejashwi Yadav and others in the IRCTC hotels corruption case. This case… https://t.co/F9E3EhYfJM pic.twitter.com/zpX2ecXFcC— ANI (@ANI) October 13, 2025
మరోవైపు.. బీహార్‌లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


