
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరుగు పందెంలో తనది ముందంజేనని పాలక పక్షమైన ఎన్డీయే నిరూపించుకుంది. ఆదివారం చర్చోపచర్చల తర్వాత జేడీ(యూ), బీజేపీలు చెరో 101 సీట్లకూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. భాగస్వామ్య పక్షాల్లో ప్రధానమైన లోక్ జనశక్తి పార్టీకి 29 స్థానాలీయగా, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్తానీ అవామీ పార్టీ (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఆరేసి సీట్ల చొప్పున కేటాయించారు. సర్దుబాటు వ్యవహారం గమనిస్తే బిహార్‌ను గత నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న మండల్ రాజకీ యాల ప్రభావం కొడిగట్టిందని బీజేపీతోపాటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా భావిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. వేర్వేరు కారణాలతో ఈసారి బిహార్ పతాక శీర్షికలకెక్కింది.
హడావిడిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు పూనుకోవటం వివాదాస్పదంగా మారింది. బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లు తొలగింపే దీని ఆంతర్యమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగబోయే పోలింగ్ కూడా పెద్ద వార్తే. 2010లో ఆరు దశలలో పోలింగ్ జరిగిన ఆ రాష్ట్రంలో అది క్రమేపీ తగ్గుతూ వస్తోంది. క్రితంసారి దాన్ని మూడు దశలకు కుదిస్తే, ఈసారి రెండు దశలుగా మారింది. తొలి దశలో జరిగే 121 స్థానాల్లో అత్యధిక భాగం మధ్య బిహార్ లోనివి కాగా, కొన్ని ఉత్తరప్రదేశ్‌కు పొరుగు నున్నాయి. రెండో దశలోని 122 స్థానాలూ నేపాల్ సరిహద్దుల్లోనూ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల పొరుగున ఉన్నాయి.
ఎన్డీయే సీట్ల పంపకమే అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కుదిరినప్పటినుంచీ జేడీ(యూ) తనకు రావాల్సిన సీట్ల సంఖ్యపై పట్టుదలతో ఉండేది. తమదే పెద్ద పార్టీ గనుక అత్యధిక స్థానాలుండాలని కోరేది. కానీ 2020 ఎన్నికల్లో ప్రజలు జేడీ(యూ)ను బాగా దెబ్బతీశారు. అప్పుడు పట్టుబట్టి బీజేపీ కన్నా ఒక్క సీటైనా తనకు అధికంగా ఉండాల్సిందేనని కోరి 122 స్థానాలు తీసుకున్న జేడీ(యూ), ఒప్పందం ప్రకారం తన వాటా నుంచి మరో భాగస్వామ్య పక్షమైన హిందూస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు 11 ఇచ్చింది.
111 చోట్ల పోటీ చేయగా తీరా గెల్చుకున్నవి 43 మాత్రమే. 121 స్థానాలు రాబట్టుకున్న బీజేపీ, వికాశ్ శీల్ ఇన్‌సాన్ పార్టీ(వీఐపీ)కి 11 కేటాయించింది. 110కి పోటీ చేసి 74 చోట్ల విజయం సాధించింది. అప్పుడు ఎన్డీయే నుంచి బయటకుపోయి 135 చోట్ల పోటీ చేసిన లోక్ జనశక్తి ఒక స్థానమే గెల్చుకున్నా 33 చోట్ల తమను దెబ్బతీయగలిగిందన్న బాధ జేడీ(యూ)ను పీడించింది. బీజేపీ లోపాయకారీ మద్దతు వల్లే ఇలా జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే సీఎంగా ఉన్నా మధ్యలోనే ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి మహా కూటమి వైపు వెళ్లి సీఎం పదవిని పదిలం చేసుకున్నారు నితీశ్. కానీ అది కూడా ఎంతోకాలం సాగలేదు. తిరిగి ఎన్డీయే వైపు వచ్చారు.
బిహార్ రాజకీయాల్లో నితీశ్ శకం ముగిసిందనీ, తన ప్రాభవం మొదలైందనీ బీజేపీ విశ్వసిస్తోంది. తాజా సర్దుబాటులో 29 స్థానాలు పొందిన ఎల్‌జేపీ పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంటుంది గనుక ఈసారి సీఎం పదవి సునాయాసంగా రాగలదని భావిస్తోంది. క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశే తమ సీఎం అని చెప్పిన ఎన్డీయే ఇప్పుడు మౌనం వహించటాన్ని జేడీ(యూ) కూడా గమనించకపోలేదు. కానీ ఆ పార్టీకి వేరే గత్యంతరం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే జేడీ(యూ) కన్నా ఒక స్థానం అధికంగా డిమాండ్ చేసి సాధించుకున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సరళిని అనుసరిస్తుందని నితీశ్ ముందే గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీది పైచేయి అయితే అది నితీశ్‌కు మాత్రమే కాదు... మొత్తంగా మండల్ రాజకీయాలకే విఘాతం.
ఎందుకంటే బీజేపీ అధికారం కైవసం చేసుకోవటమంటే విపక్ష ఆర్జేడీని కూడా వెనక్కి నెట్టినట్టే అవుతుంది. పైగా జాతీయ స్థాయిలో బీజేపీ బలం పుంజుకోవటానికి దోహదపడుతుంది. ఇంత కీలకమైన ఈ పోరులో తమ వైఖరి మారబోదని బిహార్ ఓటర్లు తేలుస్తారా... బీజేపీ కోరుకునే కొత్త దోవన పయనిస్తారా అన్నది వచ్చే నెల ఎన్నికల తర్వాత వెలువడబోయే ఫలితాలతో వెల్లడవుతుంది.