
మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి(Suresh Gopi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల కోసం తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు తన స్థానంలో రాజ్యసభ సభ్యుడు సీ సదానందన్ మాస్టర్‌ను కేంద్ర మంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారాయన.
ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ గోపి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను వదిలేసి మంత్రిని కావాలని ఏనాడూ నేను కోరుకోలేదు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత నటించలేకపోతున్నా. తద్వారా నా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. నా పిల్లలు ఇంకా స్థిరపడలేదు. నాకు ఆదాయం అవసరం. అందుకే నటన కొనసాగించాలి అనుకుంటున్నా.
నేను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నన్ను మంత్రి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సదానందన్ మాస్టర్(Sadanandan Master)ను కేంద్ర మంత్రిని చేయండి. ఇది కచ్చితంగా కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం అవుతుంది అని సురేష్ గోపి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సదానందన్ పక్కనే ఉన్నారు.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200 చిత్రాల్లో నటించారు సురేష్ గోపి. ప్రత్యేకించి 90వ దశకంలో యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. డబ్ చిత్రాలతో తెలుగులోనూ ఆయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
2016లో బీజేపీలో చేరిన సురేష్ గోపి.. తొలుత రాజ్యసభ సభ్యుడిగా, ఆపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి నెగ్గారు. కేరళ చరిత్రలో బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి ఈయనే. అందుకే ఆయనకు కేంద్ర పెట్రోలియం.. ప్రకృతి వాయువు, పర్యాటక శాఖల సహాయ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఈ మధ్యకాలంతో తరచూ పలు వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సదానందన్ ఇటీవలె రాజ్యసభకు ఎన్నికయ్యారు. కన్నూరు జిల్లాకు చెందిన సదానందన్.. 1994లో సీపీఎం కార్యకర్తల దాడిలో రెండు కాళ్లను పొగొట్టుకున్నారు.
