
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగింపును నిరసిస్తూ ఆరేళ్ల క్రితం తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన కన్నన్ గోపీనాథన్.. తాజాగా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ & కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన కేంద్ర నిర్ణయానికి నిరసనగా, ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఐఏఎస్ గోపీనాథన్.
ఢిల్లీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా సమక్షంలో గోపీనాథన్.. సోమవారం(అక్టోబర్ 13వ తేదీ) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా గోపీనాథన్ మాట్లాడుతూ.. దేశం సరైన దిశలో పోవాలంటే కాంగ్రెస్ పార్టీనే సరైన మార్గమని నమ్మే ఇందులో జాయిన్ అయినట్లు పేర్కొన్నారు.
అందుకే రాజీనామా చేశా..
‘2019లో నేను నా పదవికి రాజీనామా చేశా. ఆ సమయంలో ప్రభుత్వం సరైన మార్గంలో పయనించలేదు,. అదే నాకు అర్థమైంది. వారు చేసిన దానిని నిరసిస్తూ నా పదవికి రాజీనామా చేశా. నేను దేశ వ్యాప్తంగా 80 నుంచి 90 జిల్లాలు తిరిగాను. ప్రజలతో మాట్లాడాను. అదే సమయంలో చాలా మంది పార్టీ నేతల్ని కూడా కలిశాను. నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశాన్ని సరైన దిశలో నడిపిస్తుందనే విషయం నాకు అర్థమైంది. అందుచేతే కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యా’ అని ఆయన పేర్కొన్నారు.
ధైర్యశాలి.. గోపీనాథన్
కాంగ్రెస్‌లో చేరిన గోపీనాథన్‌పై వేణుగోపాల్ ప్రశంసలు కురిపించారు. అత్యంత సాహసోపేతమైన అధికారుల్లో గోపీనాథన్ ఒకరని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉన్నారని, సామాజిక న్యాయం కోసం, ఐక్యత కోసం పాటుబడుతున్న వ్యక్తి గోపీనాథన్ అని ప్రశంసించారు.
కాగా, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గోపీనాథన్. ఆయన 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ -కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన కేంద్ర నిర్ణయానికి నిరసనగా గోపీనాథన్ తన ఉన్నత పదవిని వదులుకున్నారు. కరోనా సమయంలో తిరిగి పదవిలో చేరమని చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజీనామాను ఆమోదించలేదని చెప్పినా ఇక తిరిగి పదవిలో జాయిన్ అయ్యేది లేదని తెగేసి చెప్పారు.
ఇదీ చదవండి:
సినిమాలే ముఖ్యం.. రాజీనామాకు సిద్ధం: సురేష్ గోపీ