
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యవహార శైలిపై సొంత పార్టీలో.. అదీ సొంత రాష్ట్రంలోనే తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ తాజాగా పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై థరూర్ తన వైఖరిని మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదన్నారు మాజీ ఎంపీ కే మురళీధరన్.
పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ వ్యాఖ్యానించిన వేళ.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధరన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శశిథరూర్ తన తీరును మార్చుకునే వరకు.. తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోం. ఆయన మాతో కలిసి లేరు. కాబట్టి.. ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే పుట్టదు. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని మురళీధరన్ అన్నారు.

ఇదిలా ఉంటే.. కే మురళి శశిథరూర్‌పై మండిపడ్డడం ఇదే తొలికాదు. ఎమర్జెన్సీ రోజులపై థరూర్ రాసిన వ్యాసంపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆయనకు(శశిథరూర్ పేరును ప్రస్తావించకుండా) ఏమైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే.. స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.
గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్ అధిష్టానాకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి శశిథరూర్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరేమనుకున్నా తాను బీజేపీలో చేరేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ థరూర్ చెబుతూ వస్తున్నారు.