రెబెల్స్‌ ఉండొద్దు..: సీఎం రేవంత్‌ | CM Revanth held a Zoom meeting with ministers, PCC chief | Sakshi
Sakshi News home page

రెబెల్స్‌ ఉండొద్దు..: సీఎం రేవంత్‌

Feb 1 2026 4:51 AM | Updated on Feb 1 2026 4:51 AM

CM Revanth held a Zoom meeting with ministers, PCC chief

పంచాయతీ ఎన్నికల్లో రెబెల్స్‌తో కొంత నష్టం జరిగింది

ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి 

అందరినీ సమన్వయం చేసుకుని మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లండి 

90 శాతం స్థానాల్లో గెలిచి తీరాలి.. గెలిచే అభ్యర్థులకే బీఫారాలివ్వండి 

మంత్రులు, పీసీసీ చీఫ్, మీనాక్షితో జూమ్‌ సమావేశంలో సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో మంత్రుల నుంచి బూత్‌స్థాయి కార్యకర్త వరకు సమష్టిగా పనిచేసి ఘన విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శనివారం మున్సిపల్‌ ఎన్నికలపై రాష్ట్ర పార్టీ నాయకత్వంతో జూమ్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రేవంత్‌ పురపాలక ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇంచార్జులుగా నియమించిన నేపథ్యంలో ఎవరికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఆ మంత్రులు ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడాలని చెప్పారు.  

సమన్వయలోపం ఉండొద్దు.. 
పంచాయతీ ఎన్నికల్లో కొంత సమన్వయ లోపం కనిపించిందని, ఈ కారణంతోనే కాంగ్రెస్‌ పార్టీ నుంచే ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీ చేశారని సీఎం రేవంత్‌ చెప్పారు. ఈ రెబెల్స్‌ కారణంగా కొంత నష్టం జరిగిందని, మున్సిపల్‌ ఎన్నికల్లో అలా జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పార్టీ నుంచి ఎన్నికల సమాచారం కోసం వార్‌రూంను ఏర్పాటు చేశామని, ఈ వార్‌రూంతో సంప్రదింపులు జరపాలని, అవసరమైనప్పుడు వార్‌రూం సహాయం తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడా అనైక్యత కనిపించకూడదన్నారు. పార్టీ నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే గెలుపు తథ్యమని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నిరూపిస్తోందని, అంతకంటే ముందు జరిగిన కంటోన్మెంట్‌ ఎన్నికల్లోనూ ఇదే సూత్రం పనిచేసిందని చెప్పారు. 

ఇప్పుడు కూడా ఐక్యతా సూత్రాన్ని పాటించి నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, గెలిచే అభ్యర్థులకే బీఫారాలివ్వాలని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడైనా మున్సిపల్‌ చైర్మన్, కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇక ముందు అలా చేయొద్దని చెప్పారు. ఎన్నికలన్నీ పూర్తయి ఫలితాలు వచ్చాకే సామాజిక, స్థానిక సమీకరణల ఆధారంగా మేయర్లు, చైర్మన్‌లను ఎంపిక చేద్దామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు ఏజెన్సీలతో నిర్వహించిన సర్వే వివరాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మున్సిపాలిటీల వారీగా వివరించారని సమాచారం. రాష్ట్రంలోని 90 శాతం స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితులున్నాయని, బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పెరగలేదని, అక్కడక్కడా బీజేపీ ప్రభావం చూపినా మొత్తం పాలకవర్గాలను గెలిచే పరిస్థితి ఆ రెండు పార్టీలకు లేదని చెప్పినట్టు తెలిసింది.    

Advertisement
 
Advertisement
Advertisement