మార్చి 2న రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ | Rahul Gandhi will visit the state on March 2nd | Sakshi
Sakshi News home page

మార్చి 2న రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ

Feb 1 2026 4:04 AM | Updated on Feb 1 2026 4:04 AM

Rahul Gandhi will visit the state on March 2nd

డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మార్చి 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లోని హరిత రిసార్ట్స్‌లో ఈనెల 21 నుంచి నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున ఆయన హాజరవుతారని గాందీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు పది రోజులపాటు హరిత రిసార్ట్స్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులకు రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. 

టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (టీఆర్‌ఆర్‌) ఈ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌కు ఏఐసీసీ అనుమతి లభించడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రామ్మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం హరిత రిసార్ట్స్‌లో శిక్షణ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై తెలంగాణ, ఏపీలకు చెందిన డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపుతో సహా పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాల్లో పీసీసీ అధ్యక్షులను క్రియాశీలం చేయాలనేది రాహుల్‌ గాంధీ ఆలోచన. ఇందుకు సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తున్నారు. 

ఇప్పటివరకు దేశంలోని 14 రాష్ట్రాలకు డీసీసీ అధ్యక్షులను నియమించారు. అందులో గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ డీసీసీ అధ్యక్షులకు పది రోజుల రెసిడెన్షియల్‌ శిక్షణను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ దఫా అనంతగిరి కొండలు వేదికగా తెలంగాణ, ఏపీ జిల్లాల అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement