
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌కు బిగ్ షాక్ తగిలింది. రాహుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అంతకుముందు.. రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకరి తర్వాత ఒకరు రాహుల్ బాధితులమంటూ మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్‌కూటథిల్ రాజీనామా చేశాడు. తనను హోటల్ రూమ్‌కు రావాలని రాహుల్ వేధింపులకు గురిచేసినట్టు నటి రిని ఆరోపించారు.
తర్వాత హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. తనను అత్యాచారం చేస్తానంటూ రాహుల్ మమ్‌కూటథిల్ మెసేజ్‌లు పంపాడంటూ ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది. ‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.
అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్‌లు చేస్తానన్నోడిని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని అవంతిక ప్రశ్నించింది. రాహుల్‌తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్‌ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది. దీంతో, ఇటు మహిళల ఆరోపణలు, పార్టీ నుంచి, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజాగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.