‘ఏ తప్పూ చేయకున్నా.. రాజీనామా చేస్తున్నా’ | Kerala Youth Congress President Rahul Mamkootathil Resigns Amid Sexual Harassment Allegations | Sakshi
Sakshi News home page

‘ఏ తప్పూ చేయకున్నా.. రాజీనామా చేస్తున్నా’

Aug 21 2025 2:36 PM | Updated on Aug 21 2025 3:04 PM

Rahul Mamkootathil Resigned As Kerala Youth Congress chief

కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పాలక్కడ్‌ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్(35) రాజీనామా చేశారు. ఆయనపై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నాం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే..

రాజీనామా చేయాలంటూ ఏఐసీసీ నుంచి ఒత్తిళ్లు వస్తునన్నట్లు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. కానీ, తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని ఆయన చెబుతున్నారు. ‘‘దేశ రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా నేను ఇప్పటిదాకా ఎలాంటి తప్పు చేయలేదు. నా మీద ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. నా రాజీనామా ఎవరూ కోరలేదు. అయినప్పటికీ నా పదవికి నేను రాజీనామా చేస్తున్నా. ఏ తప్పు చేయకపోయినా నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలేనని నిరూపించేందుకు ఈ రాజీనామా. 

నాకు మద్దతుగా నిలవడం కాంగ్రెస్‌ కార్యకర్తల పని కాదు. వాళ్లను ఆ పని చేయమని నేను కోరే రకమూ కాదు. నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకుంటా. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం నాతో సహా ప్రతీ ఒక్కరి బాధ్యత’’ అని ఆదూర్‌ నివాసంలో మీడియా ప్రతినిధులకు ఆయన తెలిపారు.

మలయాళ నటి రిని ఆన్‌ జార్జ్‌ సంచలన ఆరోపణలతో ఇవాళ కేరళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఓ యువ ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యంగా తనకు సందేశాలు పంపించాడని, హోటల్‌కు రమ్మంటూ ఒత్తిడి చేశాడని, ఈ వ్యవహారంపై అతని పార్టీకి ఫిర్యాదు చేస్తానని చెబితే చేసుకోమని సమాధానామిచ్చాడని తెలిపింది. తనలాగే చాలామంది బాధితులు ఉన్నారంటూ ఆమె మీడియాకు తెలిపింది. ఈ క్రమంలో.. 

రాహుల్ మమ్‌కూటథిల్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే ఆమె తనకు మంచి స్నేహితురాలని, తన పేరేం చెప్పలేదు కదా అని అంటూనే.. బహుశా వేరేవరో ఆమెను వేధించి ఉంటారని మీడియాతో అన్నాడు. ఈలోపే.. 

మలయాళీ రైటర్‌ హనీ భాస్కరన్‌ ఏకంగా రాహుల్ మమ్‌కూటథిల్ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. దీంతో దుమారం రేగింది. అధికార సీపీఐ(ఎం) కూటమి ఎల్డీఎఫ్‌, బీజేపీలు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో వ్యవహారం హైకమాండ్‌కు చేరడంతో.. రాహుల్‌ మమ్‌కూటథిల్‌ను రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ కోరినట్లు అక్కడి మీడియా చానెల్స్‌లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.

చిన్నవయసులోనే పలు వ్యాపారాల్లో రాణించిన రాహుల్ మమ్‌కూటథిల్.. 2006లో కేరళ స్టూడెంట్స్‌ యూనియన్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. జిల్లా అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించాడు.  కిందటి ఏడాది పాలక్కడ్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement