
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణల ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు బాధితులమంటూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా.. హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు.
తనను అత్యాచారం చేస్తానంటూ పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ మెసేజ్‌లు పంపాడంటూ ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది. ‘‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.
అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్‌లు చేస్తానన్నోడిని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని అవంతిక ప్రశ్నించింది. రాహుల్‌తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్‌ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది.
రాహుల్ మమ్‌కూటథిల్‌పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్‌కూటథిల్ గురువారమే రాజీనామా చేశాడు. అయితే.. ఈ ఆరోపణల్లో ఇప్పటివరకు ఎవరూ అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని శపథం చేశాడు.