
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారాల్లో.. అక్కడి పార్టీలు తలమునకలై పోయాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార డీఎంకేను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ బీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఎన్డీయే కూటమిలో(TN NDA Alliance) భాగంగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి నిష్క్రమించిన తర్వాత.. మరికొందరు కూడా ఆ బాటలోనే గుడ్‌బై చెప్పేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ కొత్తు పొ(ఎ)త్తులకు తెర తీసింది.
డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం లక్ష్యంతో.. ఎన్డీయేను బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి.. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ జయ్ పాండా, కో-ఇన్‌చార్జ్ మురళీధర్ మొహోల్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపారు.
ఇందులో ప్రధానంగా.. విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) గురించే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. టీవీకే పార్టీకి 20% ఓటు షేర్ కలిగి ఉందట. ఇందులో.. 60 శాతం NDA వ్యతిరేక ఓట్లే ఉన్నాయని ఓ అంచనాకి వచ్చింది. ఈ క్రమంలో.. విజయ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం అమలు చేస్తోంది.
తాజాగా కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్‌కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని, ఏకపక్షంగా టీవీకేను లక్ష్యంగా చేసుకుంటే తమ మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్‌కు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు మొన్నీమధ్యే కథనాలు ఇచ్చాయి. ఈ క్రమంలో.. విజయ్ అభిమాన గణాన్ని ఆకర్షించడంతో పాటు మరో ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణ తమిళనాట జోరుగా సాగుతోంది.
కరూర్ ఘటనకు ముందు దాకా.. ఏ కూటమిలో టీవీకే భాగంకాదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అయితే అధికారం కోసం కదిలొచ్చే పార్టీలను స్వాగతిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. దీంతో.. తమిళనాట చిన్నపార్టీలన్నీ టీవీకే వైపు ఒక్కసారిగా తిరిగాయి. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికకళ వర్గం, టీవీకే దినకరన్ వర్గం సహా పలు పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకేనని చర్చా జరిగింది. అంతెందుకు..
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(PMK)లోనూ అంతర్గత విభేదాలు తలెత్తి.. ఆ పార్టీ సీనియర్ నేత రామదాస్ తనయుడు ఏ రామదాస్.. టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నవంబర్ లేదా డిసెంబర్‌లోపు ఆయా వర్గాలు విజయ్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రకటనలు చేస్తాయని దాదాపు ఖరారైంది. అయితే..
ఈలోపు కరూర్ ఘటనతో టీవీకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో విజయ్‌కు మద్దతు ప్రకటించడం మంచిది కాదనే పునరాలోచనలో ఉన్న ఆ వర్గాలకు బీజేపీ గాలం వేస్తోందని తెలుస్తోంది. తద్వారా ఓట్ల చీలికను నివారించడమే కాకుండా.. ఎన్డీయే కూటమిని బలపర్చుకునే యోచనలో బీజేపీ ఉంది. అయితే..
ఈ విషయంలో అన్నాడీఎంకే నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు. బహిష్కృత నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేది లేదని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలోపు పళనిని ఒప్పించే బాధ్యతలను ఎన్నికల ఇంచార్జిలకు బీజేపీ అప్పగించినట్లు తమిళ వెబ్‌సైట్లు కథనాలు ఇస్తున్నాయి.
ఇదీ చదవండి: అమిత్ షాపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు