
మోదీకి ద్రోహం చేసి ప్రధానమంత్రి అవుతారేమో!
ఆయనే అసలైన ప్రధాని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు
కోల్‌కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. అమిత్ షా చర్యలు ‘యాక్టింగ్ ప్రధానమంత్రి’లాగా ఉన్నాయని మండిపడ్డారు. ఆయనే అసలైన ప్రధానమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ బుధవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఏదో ఒకనాడు మరో ‘మీర్ జాఫర్’ అయ్యే ప్రమాదం ఉందన్నారు.
అమిత్ షాను అవసరానికి మించి విశ్వసించవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. 18వ శతాబ్దంలో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు ద్రోహం చేసిన మీర్ జాఫర్ ఉదంతాన్ని ఆమె ప్రస్తావించారు. సిరాజుద్దౌలాను గద్దెదించిన తర్వాత బ్రిటిష్ వాళ్ల అండతో మీర్ జాఫర్ పాలకుడయ్యాడని గుర్తుచేశారు. అమిత్ షా సైతం అదేతరహాలో నరేంద్ర మోదీకి ద్రోహం చేసి, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు.
అమిత్ షా పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకుల ఓట్లను తొలగించడానికి బీజేపీ అధిష్టానం కుట్రలు సాగిస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ముసుగులో లక్షలాది ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇదంతా అమిత్ షా ఆడుతున్న ఆట అంటూ ధ్వజమెత్తారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదన్న సంగతి తెలుసుకోవాలని బీజేపీకి హితవు పలికారు.