
పట్నా: బీహార్‌లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్ బంధన్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించనప్పటికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.
బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజస్వి ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే మధుబని జిల్లాలోని ఫుల్పరాస్ నుండి కూడా పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ఫుల్పరాస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి తేజస్వి పోటీ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు స్థావరాన్ని ఏకీకృతం చేయాలని పార్టీ భావిస్తోంది.
ఫుల్పరాస్ నుండి ప్రముఖ ఈబీసీ నేత మంగ్ని లాల్ మండల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్జేడీ ఇటీవలే నియమించింది. మిథిలాంచల్‌లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఫుల్పరాస్ నుండి తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని, ఈ ప్రాంతంలో ఆర్జేడీ అవకాశాలను బలోపేతం చేయగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తేజస్వి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.