పాక్‌లో తక్షశిలకు ఎందుకెళ్లారు? | Assam CM Himanta Biswa Sarma Seeks Explanation From Gaurav Gogoi Over His Pakistan Trip, Gogoi Says No Ties With Pak | Sakshi
Sakshi News home page

పాక్‌లో తక్షశిలకు ఎందుకెళ్లారు?

Feb 10 2026 6:25 AM | Updated on Feb 10 2026 10:02 AM

Himanta Biswa Sarma Seeks Explanation from Gaurav Gogoi on Pakistan Visit

రావల్పిండి పర్యటన ఏర్పాట్లు చేసిందెవరు? 

అనధికార పర్యటనపై గౌరవ్‌ గొగోయ్‌ వివరణ ఇవ్వాలి 

అస్సాం సీఎం హిమంత డిమాండ్‌

గువాహటి: అస్సాం బీజేపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ మధ్య పరస్పర ఆరోపణల అగ్ని మరింత రాజుకుంది. ‘‘భార్య ఉద్యోగ పనుల నిమిత్తం 2013 డిసెంబర్‌లో పాకిస్తాన్‌కు వెళ్లానని గోగోయ్‌ చెప్తున్నారు. అయితే వీసా అనుమతుల ప్రకారం లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లకు మాత్రమే పర్యటించే వీలుంది. 

కానీ రావల్పిండి జిల్లాలోని తక్షశిలకు గోగోయ్‌ దంపతులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?. వీసా పరిధిలోని నగరాలకు వెళ్లేందుకు పాకిస్తాన్‌లో స్థానికంగా గొగోయ్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?. రావల్పిండి జిల్లాల పర్యటన ఏర్పాట్లు స్థానికంగా చేసిందెవరు?. పాకిస్తాన్‌ ఆర్మీ జనరల్‌ ప్రధాన కార్యాలయం సైతం రావల్పిండిలోనే ఉంది. పాక్‌ నిఘా వర్గాలతో గొగోయ్‌కు సంబంధం ఉందనడానికి ఇంతకంటే రుజువులు కావాలా?. గొగోయ్‌ తన పాక్‌ అనధికర, దేశవ్యతిరేక పర్యటనపై వివరణ ఇవ్వాల్సిందే’’అని సీఎం హిమంత డిమాండ్‌చేశారు.  

హిమంత మాటల్లో నిజం లేదు: గొగోయ్‌
హిమంత ఆరోపణలపై గొగోయ్‌ సోమవారం దీటుగా ప్రతిదాడిచేశారు. ‘‘నా కుటుంబానికి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. భార్య పనినిమిత్తం పది రోజులు మాత్రమే పాక్‌కు వెళ్లివచ్చాం. అక్కడ ఎవరినీ కలవలేదు. ఈ విషయం అస్సాం పోలీస్‌ రిపోర్ట్‌లోనూ స్పష్టంగా ఉంది. నివేదిక వచ్చి ఆరు నెలలవుతుంటే ఇన్నాళ్లూ హిమంత ఏం చేస్తున్నట్లు?. హిమంత తన కుటుంబం ఆక్రమించిన వేల ఎకరాల భూముల అంశం నుంచి అస్సామీల దృష్టి మరల్చేందుకే నాపై అభాండాలు వేస్తున్నారు. 

రాష్ట్రంలో ఆరు కులాలకు ఎస్టీ హోదా, మాదకద్రవ్యాలు హోరెత్తడం వంటి సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుంది. అవి వదిలేసి బంగ్లాదేశీ ముస్లిం వలసదారు(మియా)లను లక్ష్యంగా చేసుకుంటూ వాళ్లను రైఫిల్‌తో గురిపెట్టి కాల్చుతున్నట్లు ఉన్న వీడియోను ఆన్‌లైన్‌లో విస్తృత ప్రచారంచేశారు. ఇలాంటి మతవిద్వేష వీడియోలను బీజేపీ అస్సాం విభాగం సోమవారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేసి తీవ్ర విమర్శలు రాగానే తొలగించారు. ఈ వివాదంలో పోలీసులు సూమోటోగా కేసు నమోదుచేసి సీఎంపై నేరం మోపాలి’’అని గొగోయ్‌ డిమాండ్‌చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement