
పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ మంత్రి మురారి ప్రసాద్ గౌతమ్ బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గౌతమ్ రాజీనామాతో రోహ్తాస్ జిల్లా చెనారి రిజర్వుడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని బీహార్ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ సందర్భంగా ‘శాసన సభ్యత్వానికి రాజీనామా వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గౌతమ్ పీటీఐకి స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ ప్రభుత్వంలో గౌతమ్ మంత్రిగా పనిచేశారు. జేడీ(యూ) మళ్లీ ఎన్‌డీఏలోకి వచ్చిన తర్వాత, ఆయన ట్రెజరీ బెంచ్ సభ్యులతో కలిసి కూర్చోవడం ప్రారంభించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ ముందు పెండింగ్‌లో ఉంది. నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుండటం తెలిసిందే.