
అయ్యప్ప స్వామి పేరును మరోసారి రాజకీయాలకు వాడుతున్నారా? గ్లోబల్ అయ్యప్ప సంగమం పేరుతో జరిగింది నిజంగా ఆధ్యాత్మిక సభేనా? లేదా ఎలక్షన్ సభా?ఈ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) రాజకీయాల ఊసెత్తడం ప్రకంపనలు కారణమైంది. ఓవైపు ఈ సభకు ఎంతమంది వచ్చారన్నదానిపై గందరగోళం నెలకొంది.
3వేల మంది వస్తారని భావిస్తే ఏకంగా 4వేల మందికిపైగా వచ్చారని కేరళ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఖాళీ కుర్చీలే ఎక్కువ ఉన్నాయని..ఇది AI మాయజాలమని కాంగ్రెస్ గట్టిగా కేకలు వేస్తోంది. ఇటు అయ్యప్ప పేరును కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ వాదిస్తోంది. ఇలా అయ్యప్ప చుట్టూ మూడు పార్టీలూ తన్నుకుంటున్నాయ్. ఈ మొత్తం వ్యవహారంలో దేవుడే సెంట్రిక్‌గా మారాడు.
నిజానికి కేరళలో ఉన్నది నాస్తిక కమ్యూనిస్టు ప్రభుత్వం. మతపరమైన ఆచారాలను తిరస్కరించే భావాజాలం ఆ పార్టీది. ఇదే నిజమని చరిత్ర కూడా చెబుతుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశం కోసం మహిళల పోరాటం చేసినప్పుడు ఇదే కమ్యూనిస్టు పార్టీ.. నాడు ధార్మికతను పక్కనపెట్టింది. ఫెమినిస్టులవైపు నిలబడి టెంపుల్ ఎంట్రీ ఉద్యమాన్ని వెనుక నుంచి నడిపించింది. కానీ నేడు అదే పార్టీ అయ్యప్ప పేరిట సభలు పెట్టి, అయ్యప్పను రాజకీయ నాటకరంగంలోకి తెచ్చుకోవడం వ్యతిరేకతను రగిలిస్తోంది. ఇది కమ్యూనిస్టు ప్రభుత్వ హిపోక్రసీకి నిదర్శనమని కాంగ్రెస్ అంటోంది. ఇక మతాన్ని వ్యతిరేకించిన మీరే ఇప్పుడు మతం పేరుతో వేదికలు కడుతున్నారని బీజేపీ ఎగతాళి చేస్తోంది. ఇటు ఓవరాల్‌గా చూస్తే సెక్యులరిజం (Secularism) అనే పెద్ద మాటను పక్కన పెట్టి, మతం అనే ఆయుధాన్ని వాడుకునే ఈ దృశ్యం కేరళ రాజకీయ చరిత్రలో ఒక విరుద్ధమైన మలుపుగా నిలిచింది.
ఇదంతా ఎలక్షన్ డ్రామా అని కాంగ్రెస గట్టిగా వాదిస్తోంది. విజయన్ ప్రభుత్వం హిందూ ఓట్ల కోసం అయ్యప్ప పేరును వాడుకుంటుందని ఆరోపిస్తోంది. ఇది భక్తులను మోసం చేయడమేనని బీజేపీ మంటలు రేపుతోంది. ఇటు ఈ సభలో ఎంతమంది భక్తులు కూర్చున్నారన్నది ఎవరికీ పట్టకపోవచ్చు. దేవుడు పేరు చుట్టూ ఏ పార్టీ ఎన్ని ఓట్లు లాగుతుందన్నదే ఇప్పుడు నిజమైన స్వామి దర్శనం అయిపోయింది. మరోవైపు అయ్యప్ప భక్తుల కోణం నుంచి ఆలోచిస్తే ఇది వారికి శోకంగా మారింది. అయ్యప్పస్వామి పేరుతో రాజకీయ కేరింతలు వినిపించడం వారిని కలవరపెడుతోంది. భక్తుల మనసులో ఒకే ఒక్క భావన ఉంది. తామంతా స్వామిని ప్రార్థించడానికి వస్తామని, కానీ రాజకీయ వేదికల్లో స్వామి పేరు వినిపించడం దురదృష్టమని కొంతమంది భక్తులు వాపోతున్నారు.
ఇలా భక్తుల బాధ ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ రంగంలో వేగంగా పావులు కదుపుతున్నాయి. శబరిమలలో ద్వారపాలక విగ్రహాల బంగారు కవచం తొలగింపులో జరిగిన చిన్న తప్పిదమే బీజేపీకి బలమైన బాణంగా మారింది. అక్కడి నుంచే ఈ కొత్త యుద్ధరంగం మొదలైంది. అయ్యప్ప స్వామి పేరు రక్షించేది మేమే, అయ్యప్ప గౌరవాన్ని కాపాడేది మేమే అని బీజేపీ గట్టిగా నినదించింది. సంఘపరివార్ సంస్థలు వీధుల్లోకి వచ్చి భక్తుల ఆవేదనను తమ కంఠస్వరంగా మార్చుకున్నాయి. కమ్యూనిస్టు పార్టీ అయ్యప్ప పేరుతో సభలు పెడితే అదే సభను ఆయుధంగా వాడుకుంటూ బీజేపీ కొత్త మంటలు రేపుతోంది. భక్తుల మనసులో మంట పెట్టడం, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని దూషించడం, భక్తిని ఓటు పెట్టెలోకి నెట్టేయడం.. ఇదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. కమ్యూనిస్టులు ఎంతగా అయ్యప్ప పేరును వాడుతున్నారో, బీజేపీ కూడా అంతే వాడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటు కేరళ రాజకీయాల్లో మరో కొత్త మలుపు ఏంటంటే రాష్ట్రంలోని ప్రధాన హిందూ సంఘాలు కూడా రంగంలోకి దిగడం సంచలనం రేపింది. శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం అంటే ఈజవ సమాజానికి వెన్నెముక లాంటి సంస్థ. అలాగే నాయర్ సర్వీస్ సొసైటీ అంటే నాయర్ వర్గానికి ప్రాణాధారం లాంటి శక్తి. ఈ రెండు పెద్ద సంఘాలు చరిత్రలో ఎక్కువగా కాంగ్రెస్ వైపు నిలబడ్డాయి. కానీ ఈసారి గ్లోబల్ అయ్యప్ప సంగమానికి (global ayyappa sangamam) వీరిద్దరూ మద్దతు తెలపడం రాజకీయ లెక్కల్లో పెద్ద మార్పుని తెచ్చింది. కమ్యూనిస్టులు ఇప్పటివరుకు మతానికి వ్యతిరేకమని చెప్పుకున్నా ఇప్పుడు ఈ సంఘాల సపోర్ట్‌ను జేబులో వేసుకోవడానికి వేదికలు కడుతున్నారు. భక్తి పేరుతో ఓట్లు లాగాలని వారి యత్నం స్పష్టంగా కనిపిస్తోందనే వాదన ఉంది. కాంగ్రెస్ దీన్ని చూసి తికమకపడుతోంది. ఎందుకంటే తమ సాంప్రదాయ మిత్రులు కమ్యూనిస్టులవైపు జారిపోతున్నారని భయం మొదలైంది.
ఇలా అయ్యప్ప స్వామి చుట్టూ కేరళ రాజకీయాలు (Kerala Politics) ఒక వింత నాటకంలా మారాయి. భక్తుల మనసులో ప్రార్థన ఉండాలి కానీ నాయకుల మనసులో లెక్కలే మిగిలాయి. దేవాలయ గర్భగుడిలో భక్తి ఉండాలి కానీ సభా వేదికలపై గర్జనలే వినిపిస్తున్నాయి. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయన్నదే ఇప్పుడు అయ్యప్ప స్వామి పేరుకు కొత్త అర్థం అయిపోయింది. ఒకవైపు కమ్యూనిస్టులు హిందూ ఓట్లు దక్కించుకోవాలని యత్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తమ మిత్రులను కోల్పోతామేమోనని టెన్షన్ పడుతోంది. ఇంకో వైపు బీజేపీ ఈ మొత్తం మంటను తమ కుండలో వండుకోవాలని తహతహలాడుతోంది. చివరికి అయ్యప్ప స్వామి పేరు.. పంచాయితీల బల్లమీద నాణేంగా మారిపోయింది.