ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్‌స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్‌సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్‌సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్‌సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్‌సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు.
జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్‌సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్‌బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు.
ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్‌కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్‌కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది.
కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్‌కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్‌సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్‌పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్‌లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు.
లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్‌సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.
రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్‌సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది.
ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్‌గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!


