
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యేలు నవాడా ఎమ్మెల్యే విభాదేవి, రజౌలి ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్‌ను కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ పోక్సో కేసులో కొన్నేళ్లుగా జైలులో ఉండి, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబంలోని వారికి టిక్కెట్ ఇవ్వలేదని ఆర్జేడీపై ఈయన ఆగ్రహంతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్ వీర్ మరోసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. బీహార్‌లో సీట్ల సర్దుబాటు పరిష్కారమైంది. బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల నుంచి పోటీచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎన్‌డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)తోపాటు బీజేపీ సైతం చెరో 101 సీట్ల నుంచి బరిలో దిగనుంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ 29 స్థానాల నుంచి పోటీ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(సెక్యూలర్), ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాలు చెరో ఆరు స్థానాల నుంచి పోటీచేయనున్నాయి. 243 నియోజకవర్గాలున్న బీహార్‌లో పాలక ఎన్‌డీఏ కూటమిలో ఎవరే స్థానం నుంచి పోటీచేయాలన్న దానిపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది.