
పట్నా: బీహార్‌లో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. ఇంతలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలోని ఒక గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్ల పేర్లు ‘జాబితా’లో చనిపోయినట్లు ప్రకటించారు. అయితే వారంతా బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి(బీడీవో)ని కలుసుకుని ‘సర్, మేము బతికే ఉన్నాం’ అని పేర్కొంటూ ఒక మెమోరాండం సమర్పించారు.
బీహార్ ఎన్నికల మొదటి దశకు కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో, బంకా జిల్లాలోని ధోరైయా బ్లాక్‌లోని బట్సర్ గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమను చనిపోయినట్లు చూపడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే వీరంతా బీడీవో అరవింద్ కుమార్‌ను సంప్రదించి, తాము బతికే ఉన్నామంటూ ఒక మెమోరాండం సమర్పించారు. ముసాయిదా ఓటరు జాబితాలో మోహన్ సా, సంజయ్ యాదవ్, రాంరూప్ యాదవ్,నరేంద్ర కుమార్ దాస్, విశ్వవర ప్రసాద్‌ల పేర్లు ఉన్నాయి.
సామాజిక కార్యకర్త ఇంద్రదేవ్ మండల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఐదుగురు ఓటర్లు.. జాబితాలోని లోపం కారణంగా ఓటు హక్కును కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బీడీఓ కుమార్ వీరి ఫిర్యాదుపై స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ఏ ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోరని ఆయన పేర్కొన్నారు. దీనికిముందు చంపారన్‌లోని బాగహి పంచాయతీలోని డుమ్రి గ్రామంలో 15 మంది ఓటర్ల పేర్లు జాబితాలో చనిపోయినట్లు చూపించారు. తరువాత దానిని సరిచేశారు. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ ఆరు, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.