
పట్నా: ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ తనపై వస్తున్న ఊహాగానాలను తిప్పికొట్టారు. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తాను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుడినని చెప్పుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తానువున్న ఫోటోను షేర్ చేసిన పవన్ సింగ్.. తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు.
मैं पवन सिंह अपने भोजपुरीया समाज से बताना चाहता हूँ कि मैं बिहार विधानसभा चुनाव लड़ने के लिए पार्टी ज्वाइन नहीं किया था और नाहीं मुझे विधानसभा चुनाव लड़ना है |
मैं पार्टी का सच्चा सिपाही हूँ और रहूँगा। pic.twitter.com/reVNwocoav— Pawan Singh (@PawanSingh909) October 11, 2025
‘నేను, పవన్ సింగ్.. మా భోజ్‌పురి కమ్యూనిటీకి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నేను బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలో చేరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను పార్టీకి నిజమైన సైనికుడిని..అలా సైనికునిగానే ఉంటాను’ అని పవన్ సింగ్ తన ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.
భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ 2024లో బీజేపీ నుంచి మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుండి పోటీకి దిగారు. అయితే తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలుతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొన్ని సీట్లను కోల్పోయేలా చేసింది.
బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2022, ఆగస్టులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2024, జనవరిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో సంబంధాలను తెంచుకుని, తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.