
పట్నా: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) పూర్తయిన తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ప్రచురించింది. ఏ ఓటరు అయినా తన ఓటరు నమోదు వివరాలను భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చని పోల్ బాడీ అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ జాబితా ఆధారంగానే నిర్వహించనున్నారు.
2025, అక్టోబర్ ఆరు- ఏడు తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. 22 ఏళ్ల విరామం తర్వాత బీహార్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ కసరత్తు రాజకీయ, చట్టపరమైన చర్చలకు కేంద్రంగా నిలిచింది. ఆగస్టు ఒకటిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురితం కాగా, సెప్టెంబర్ ఒకటి వరకు అభ్యంతరాల కోసం గడువు ఇచ్చారు. ప్రక్రియకు ముందు, బీహార్‌లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.ముసాయిదా జాబితాలో 7.24 కోట్లు ఉన్నట్లు తేలింది. 65.63 లక్షల మంది పేర్లను తొలగించారు. ముసాయిదా ప్రచురణ తర్వాత, మూడు లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు.
అభ్యంతరాల సమయంలో 2.17 లక్షల మంది తమ పేర్లను తొలగించడానికి దరఖాస్తు చేసుకోగా, 16.93 లక్షల మంది తమ పేర్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు ఒకటి, సెప్టెంబర్ ఒకటి మధ్య 16.56 లక్షలకు పైగా ఓటర్లు కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఫారం-6ను సమర్పించారు. దాదాపు 36 వేల మంది తమను ఓటర్లుగా చేర్చాలని కోరగా, అభ్యంతరాల దశలో 2.17 లక్షల మంది తమ పేర్ల తొలగింపునకు అభ్యర్థించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 30 మధ్య వచ్చిన దరఖాస్తుల పరిష్కారం అక్టోబర్ ఒకటి నుండి జరగనుంది. నిబంధనల ప్రకారం ఓటర్లు నామినేషన్ చివరి తేదీకి 10 రోజుల ముందు వరకు ఓటరుగా చేరిక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటప్పుడు వారి పేర్లు అనుబంధ జాబితాలో కనిపిస్తాయి. తదుపరి ఎన్నికల సమయంలో వారు సాధారణ జాబితాలో ఉంటారు.
ఇదీ చదవండి:
తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తు