
- విజయ సభలో తొక్కిసలాట నేపథ్యంలో సరికొత్త ప్లాన్
- హేమామాలిని సారధ్యంలో కమిటీ.. కరూర్ లో పర్యటన
- పాత మిత్రులతో కలిసి కొత్త పోరుకు సిద్ధం
దేశంలో ఇంతపెద్ద రాష్ట్రాన్ని అయినా జయిస్తున్న భారతీయజనతా పార్టీకి దక్షిణాది మాత్రం కోరుకుడుపడడం లేదు.. ఇటువైపున్న ద్రావిడ రాష్ట్రాలు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. ఏపీ.. తెలంగాణ.. పాండిచ్చేరి.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే.. ఏదో నానా యాతనా పడి..ఏదోలా కర్ణాటకలో ఏదోలా అధికారం దక్కించుకున్నా అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతోంది తప్ప మళ్ళా అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇక ప్రాంతీయపార్టీలు ఆలవాలమైన తమినాడులో అయితే దశాబ్దాలుగా పోరుతున్నా బీజేపీ అడుగుకూడా పెట్టేందుకు వీలు చిక్కడంలేదు.
అక్కడ ఉంటే అన్నాడీఎంకే.. కూడా డీఎంకే.. ఇక మిగతావన్నీ చిన్నా చితకాపార్టీలు మాత్రమే.. దేశాన్ని 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కూడా తమిళనాట నాడు కరుణానిధి.. నేడు స్టాలిన్ చాటున మనుగడసాగించడమే తప్ప సొంతంగా అక్కడ సాధించిందేమీ లేదు.. ఇక బీజేపీ మాత్రం ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని తీవ్రంగా తాపత్రయపడుతోంది. ఆ రాష్ట్ర శాసన సభలో 234 సీట్లుండగా అక్కడ 2026 ఏప్రిల్.. మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రస్తుతానికి 46 శాతం ఓట్లు సాధించిన స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే 159 సీట్లు సాధించి అధికారంలో ఉంది.. తరువాత 74 సీట్లతో పాళనిస్వామి సారథ్యంలోనే అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్రలో ఉంది.. ఇక ఇక్కడ బీజేపీకి స్థానం తక్కువే.. కానీ ఆశ చావని బీజేపీ నేతలు దింపుడుకల్లం ఆశతో తమిళనాడువైపు చూస్తూనే ఉన్నారు..
ఇదిలా ఉండగానే మొన్న సినిమా నటుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించగా వందమందికి పైగా గాయపడ్డారు.. ఇది రాజకీయ సభలకు సంబంచింది దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు.. అయితే ఈ ప్రమాద సంఘటన తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపీ హేమామాలిని సారధ్యంలోని ఎనిమిది మంది ఎంపీలతో ఒక కమిటీని వేసింది. తెలుగుదేశం.. శివ సేన వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకూ ఈ కమిటీలో స్థానం కల్పించిన బీజేపీ అక్కడి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ సభలో జరిగిన ప్రమాదాన్ని సైతం రాజకీయంగా ఎలా వాడుకోవాలన్నదానిగురించి బీజేపీ యోచన చేస్తోంది.
అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2. 62 శాతం ఓట్లు తెచ్చుకుని కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీకి అన్నా డీఎంకేతో వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.. ఈ విజయ్ సభ ప్రమాదాన్ని సైతం బీజేపీ రాజకీయంగా వినియోగించుకునే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా వాడుకుని లబ్ధిపొందుతారుతప్ప వారి యోగ క్షేమాలు.. భద్రతా ఏమాత్రం పట్టించుకోవు అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఈ ప్రమాదాన్ని సామాజిక అంశంగా మార్చుకుని రాజకీయంగా లబ్ధిపొందడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వెతుకుతోంది.. ఇకనైనా రాష్ట్రంలో అన్నా డీఎంకేతో కలిసి అధికారంలోకి వస్తుందా చూడాలి..
సిమ్మాదిరప్పన్న
ఇదీ చదవండి:
అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు