తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?
నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్‌లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.
తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ‍్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?
ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.
విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్లో ఉంటాడు.
రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్‌కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో?


