దాన్ని దాచిపెట్టి మమ్మల్ని బద్నాం చేస్తారా?: మంత్రి ఉత్తమ్
అబద్ధపు పునాదులపైనే బీఆర్‌ఎస్ రాజకీయం
అసలు 45 టీఎంసీలు కృష్ణా, 45 టీఎంసీలు గోదావరి జలాలుగా విడగొట్టిందెవరు?
పాలమూరు పనులను నెమ్మదిగా చేయాలని ఆదేశాలిచ్చిందెవరు?
ఎంత ఖర్చయినా సరే 90 టీఎంసీలు, 12లక్షల ఎకరాల ఆయకట్టుతో పూర్తి చేస్తాం
పాలమూరు–రంగారెడ్డిపై మీడియాతో చిట్‌చాట్
సాక్షి, హైదరాబాద్: అబద్ధాల పునాదులపైనే బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ చేతకానితనంతో తెలంగాణకు తీరని నష్టం కలిగిందని, ఇప్పుడు ఆ చేతకానితనాన్ని దాచిపెట్టి కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలు కేటాయించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
ఉత్తమ్ ఈ ప్రాజెక్టు గురించి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతలు, ముఖ్యంగా హరీశ్‌రావు చెపుతున్న వాటిలో 100 శాతం అబద్ధాలేనని అన్నారు. వారి మాటలు వింటుంటే గోబెల్స్ ఆత్మ క్షోభిస్తుందని, తాను నేర్పిన విద్యను తన కంటే ఎక్కువగా వాడుకుంటున్నారని పైన ఉన్న ఆయన అనుకుంటున్నాడేమోనని ఎద్దేవా చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కేటాయింపులతో 12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఎంత ఖర్చయినా సరే ఈ దఫాలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
గందరగోళ పరుస్తున్నారన్నారు..
వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుకు చేయాల్సిన 90 టీఎంసీల కేటాయింపుల్లో 45 టీఎంసీలు కృష్ణా నుంచి, 45 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లించడం ద్వారా తీసుకుంటామని 2022, ఆగస్టు 18న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఉత్తమ్ చెప్పారు. అయితే, 45 టీఎంసీల గోదావరి నీటి విషయం ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నందున అది కోర్టు పరిధిలోకి వస్తుందని, ఈ కారణంతోనే తాము 90 టీఎంసీల తుది కేటాయింపులు చేయలేమని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసిందని వివరించారు.
ఈ పరిస్థితుల్లో తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే 45 టీఎంసీల కృష్ణా జలాలను మొదటి దశలో కేటాయించాలని, తర్వాతి దశలో మిగిలిన 45 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ సీడబ్ల్యూసీకి లేఖ రాశామే తప్ప ఎక్కడా కేటాయింపులను 45 టీఎంసీలకు తగ్గించాలని కోరలేదని స్పష్టంచేశారు. అసలు తెలంగాణ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తగ్గించాలన్న కాగితంపై మంత్రిగా తానెందుకు సంతకం చేస్తానని ప్రశ్నించారు. కానీ, హరీశ్‌రావు మాత్రం తమ లేఖను చూపిస్తూ తనకు అనుకూలంగా ఉన్న వాక్యాలను మాత్రమే చదివి ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు. హరీశ్‌రావు తానే ఇరిగేషన్ మాస్టర్ అనుకుంటున్నాడని, అంత అహంకారం ఆయనకు ఎందుకని ప్రశ్నించారు.
వేగం వద్దని చెప్పిందెవరు?
‘ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న 45 టీఎంసీల కేటాయింపు కోరుతూ ఈ విషయాన్ని వివాదం చేసింది ఎవరు? పాలమూరు ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసమే కడుతున్నామని, 7.15 టీఎంసీలు సరిపోతాయని సుప్రీంకోర్టుకు చెప్పిందెవరు? 2015లో ప్రాజెక్టు నిర్మించే జీవోను విడుదల చేసి 2022 సెప్టెంబర్ వరకు డీపీఆర్ సమర్పించనిదెవరు? ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి ఈ ప్రాజెక్టును అంతర్రాష్ట్ర జలవివాదాల్లోకి నెట్టిందెవరు? కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచి, పాలమూరు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గించిందెవరు? అసలు పాలమూరు ప్రాజెక్టు పనుల్లో వేగం అవసరం లేదని, నిదానంగా చేయాలని ఇంజనీర్లకు బహిరంగంగానే చెప్పిందెవరు?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు.
67 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశాం
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తాము 90 శాతం పనులు చేస్తే గత రెండేళ్లలో తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉత్తమ్ తప్పుబట్టారు. రూ.70 వేల కోట్ల అంచనాలకు పెంచి ప్రాజెక్టు కోసం బీఆర్‌ఎస్ హయాంలో కేవలం రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి 90 శాతం పనులెలా పూర్తవుతాయని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టామని, 67 లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి పని, 7 లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్ పని చేశామని, 9 కిలోమీటర్ల పొడవైన కాల్వలు తవ్వామని చెప్పారు. తాము వచ్చిన తర్వాతే నార్లాపూర్–ఏదులకు సోర్సు గుర్తించామని చెప్పారు.


