ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి,అమరావతి: అన్నదాతలను ఆదుకోవడంతోపాటు, కనీస మద్దతు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, (వ్యవసాయం, రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాగును పూరి్తగా విస్మరించిన కూటమి పాలనలో 2025 రైతుల పాలిట చీకటి సంవత్సరమని అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడంతోపాటు రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర లేక కంది రైతులు విలవిలలాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
‘2025 – 26లో రాష్ట్రంలో దాదాపు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది కనీస మద్దతు ధర క్వింటా రూ.8 వేలు. కానీ ఆ ధర దక్కడం లేదు. రైతులు క్వింటా రూ.6,500 నుంచి రూ.6,600 వరకు అయినకాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. అయినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. పొరుగున కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం స్వయంగా కంది కొనుగోలు కేంద్రాలు తెరిచి, క్వింటా కంది రూ.8 వేలకు కొంటున్నట్లు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత ఏడాది కంది పంట ఉత్పత్తి 1.71 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది అంచనా 1.17 లక్షల టన్నులు. అలాగే గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 473 కిలోలు కాగా, ఈ ఏడాది అది కూడా 401 కిలోలకు తగ్గింది.’ అని నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
మొక్కజొన్నదీ అదే దుస్థితి
‘మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 కాగా, రైతులు క్వింటా మొక్కజొన్న రూ.1,500 నుంచి రూ.1,900 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఈ పంటను రాష్ట్రంలో ఈ సీజన్‌లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, అదీ సగటు దిగుబడి తగ్గింది. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, మన ప్రభుత్వానికి మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. మొక్కజొన్న గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 4,710 కిలోలు కాగా, ఈ ఏడాది 4,254 కిలోలు మాత్రమే అని అంచనా వేస్తున్నారు’
రైతు కంట కన్నీరు మంచిది కాదు.. అది అరిష్టం
‘రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రకృతివైపరీత్యాలకు దిగుబడి తగ్గి, ధరలు పడిపోవడంతో దిక్కుతోచక విలపిస్తున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ‘రైతు కన్నీరు మంచిది కాదు. రాష్ట్రానికి అరిష్టం’ అని ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు.


