ప్రాజెక్టుకు పది అనుమతుల్లో మేము ఏడు సాధించాం: హరీశ్
రెండేళ్లలో కాంగ్రెస్ సర్కారు ఒక్క డీపీఆర్ ఇవ్వలేదు
రెండేళ్లయినా మంత్రి ఉత్తమ్‌కు ఇరిగేషన్‌పై అవగాహన లేదు
ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌పై అర్థంలేని విమర్శలు చేస్తున్నారు
మా హయాంలో ఇచ్చిన జీఓలో 90 టీఎంసీల నీటి కేటాయింపుల అంశం స్పష్టంగా ఉంది
ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకు అంగీకరిస్తూ లేఖ రాసింది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ సహవాస దోషంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అర్థరహిత విమర్శలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీఓలో 90 టీఎంసీల నీటి కేటాయింపుల అంశం స్పష్టంగా ఉందని, ప్రస్తుత ప్రభుత్వం 45 టీఎంసీలకు అంగీకరిస్తూ లేఖ రాసిందన్నారు. అసెంబ్లీ లాబీలోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాదైనా పట్టించుకోలేదు.
ప్రాజెక్టుకు సంబంధించి మేము ఏడు అనుమతులు తెస్తే కాంగ్రెస్ రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా తేలేదు. కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్న ద్రోహులు. ప్రాజెక్టు పనులు ఆగకూడదనే ఉద్దేశంతో తాగునీటి ప్రాజెక్టు పేరిట పనులు కొనసాగించి 90 టీఎంసీల ప్రతిపాదనలతో డీపీఆర్ తయారు చేసి ఏడు అనుమతులు సాధించాం. రెండు టీఎంసీల సామర్థ్యంతో సొరంగాలు తవ్వి పనులు కొనసాగించాం.
కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రేవంత్ శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ డీపీఆర్ పంపలేదు. బీఆర్‌ఎస్ హయాంలో పాలమూరు కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 27 వేల ఎకరాల భూమి సేకరించాం. 1985లో శంకుస్థాపన చేసినా 2014 వరకు కేవలం 14వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో కల్వకుర్తిపై రూ.2,300 కోట్లు ఖర్చు చేసి మూడున్నర లక్షల ఎకరాలకు నీరు అందించాం’ అని హరీశ్ పేర్కొన్నారు.
ఉత్తమ్‌కు అవగాహన రావడం లేదు
‘నీటిపారుదల శాఖ మంత్రిగా రెండేళ్లుగా పనిచేస్తున్నా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన శాఖపై అవగాహన రావడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మేము 11 కిలోమీటర్లు తవ్వితే రెండేళ్లలో 200 మీటర్ల పని జరిగింది. బీఆర్‌ఎస్ హయాంలో ఏడు డీపీఆర్‌లకు అనుమతులు తెస్తే, కాంగ్రెస్ హయాంలో మూడు డీపీఆర్‌లు వెనక్కు వచ్చాయి. రెండేళ్లలో కాంగ్రెస్ కొత్తగా ఒక్క డీపీఆర్ కూడా పంపలేదు, ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త మాటలు మాట్లాడవద్దు. పాలమూరులో రెండేళ్లలో కిలోమీటర్ పొడవు ఉండే లింక్ కెనాల్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.


