
ఓట్ల చోరీపై మరిన్ని నిజాలు బయటపెడతా
‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తలెత్తుకోలేరని చెప్పారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ఓట్ల చోరీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బిహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మాగాం«దీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోర్, గద్దీ ఛోడ్ అంటూ వారు ముక్తకంఠంతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే...
రేషన్ కార్డును, భూమిని లాక్కుంటారు
‘‘బీజేపీ నాయకులు మాకు నల్లజెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఓట్లచోరీపై మహాదేవపురలో అణుబాంబు ప్రయోగించా. త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనంపై బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగిలించింది.
ఇది వంద శాతం నిజం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బిహార్ యువతకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే.. ఓటు చోరీ అంటే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు–ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డును, భూమిని సైతం లాక్కొని అదానీకి, అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు.
తప్పుడు విధానాలు నమ్ముకుంటున్న మోదీ: ఖర్గే
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడిన నితీశ్ ఇప్పుడు బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ల ఒడిలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పారేస్తారో నితీశ్‌ను బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లు అక్కడే పారేయడం తథ్యమని స్పష్టంచేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోదీ ఓట్ల చోరీకి ఆలోచనతోనే ఉంటారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లను, తప్పుడు ప్రచారాన్ని, తప్పు డు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటారని ఆయన తీవ్రంగా విమర్శించారు.