
జన్‌సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ జోస్యం
రఘోపూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం
వారసత్వ పాలనకు ముగింపు పలకాలని పిలుపు
రాయపూర్: ఆరేళ్ల క్రితం అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడినట్లుగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు పరాజయం తప్పదని జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. వైశాలి జిల్లా రఘోపూర్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో తేజస్వీ ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయని విలేకరులు అడగ్గా.., ప్రశాంత్ కిషోర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘మా పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీకి దింపుతుందనే ఊహాగానాలకే తేజస్వీ భయపడుతున్నారు. వారిని రెండు చోట్ల పోటీ చేయనీయండి. 2019లో రాహుల్ గాంధీ కూడా వయనాడ్, అమేథీలో పోటీ చేశారు.
కాంగ్రెస్‌కు 15 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆర్జేడీకి, తేజస్వీ యాదవ్‌కు కూడా అదే గతి పడుతుంది’’ అన్నారు. రఘోపూర్ నియోజకవర్గంలో తేజ్వసీ కుటుంబం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించారు. అయినప్పట్టకీ ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వారసత్వ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పవన్ సింగ్ శత్రువు కాదు
భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ తనకు శత్రువు కాదన్నారు. ఆయన వ్యక్తిగతంగా మిత్రుడేనని, బీజేపీలో ఉన్నారనేదానిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పవన్ సింగ్ భార్య తన అభద్రతా భావాలను పంచుకోవడానికి వచ్చినప్పుడు, తాను ఒక సోదరుడిలా హామీ ఇచ్చానన్నారు. తాను కానీ, జన్ సురాజ్ పార్టీ వారి వివాహ వివాదంలో ఎలాంటి జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.
ఆశావహుల్లో అసంతృప్తి సహజం
రెండురోజుల క్రితం పార్టీ 51 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసిన ఆశావహులను తేలికగా తీసుకున్నారు. ఇది ప్రతిపార్టీలోనూ సహజమని అన్నారు. వేలాది మంది రక్తం, కన్నీళ్లు, చెమటతో జన్ సురాజ్ పార్టీ నిర్మాణం జరిగిందన్నారు. అసెంబ్లీలో కేవలం 243 సీట్లు మాత్రమే ఉన్నప్పుడు వారందరికీ అవకాశం కల్పించడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. తమ పార్టీ అత్యంత పారదర్శక ప్రజాస్వామ్య పార్టీ సిద్ధాంతాలు కలిగి ఉందన్నారు. ప్రతీ సమస్య పరిష్కరిస్తామన్నారు.
పోటీపై పార్టీదే తుది నిర్ణయం
జన్ సురాజ్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆదివారం(ఇవాళ) జరుగుతుందన్నారు. రఘోపుర్ నుంచి తనకు వచ్చే అభిప్రాయం కూడా చర్చకు వస్తుందన్నారు. దాని ఆధారంగా, అత్యంత అనుకూలమైన అభ్యర్థిని నిర్ణయిస్తారని, అది తానేనేనా అని చెప్పలేనని అన్నారు. ఆ నిర్ణయం పార్టీ తీసుకోవాలని చెప్పారు.