
బిహార్‌లో వివాదరహితంగా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలన్న సదుద్దేశం ఎన్నికల సంఘానికి(ఈసీ)కి ఉందా? మంగళవారం విడుదల చేసిన బిహార్ ఓటర్ల తుది జాబితా గమనిస్తే ఈ విషయంలో ఎవరికైనా సంశయం కలుగుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లని ఆ జాబితా ప్రకటిస్తోంది. వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట జూన్ 24న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించే నాటికి బిహార్ ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు.
అంతకు ఆర్నెల్ల ముందు ప్రకటించిన ఆ జాబితాను కాదని మళ్లీ ఆదరా బాదరాగా ఈ సవరణ దేనికని విపక్షాలు ప్రశ్నించాయి. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, అటుపై జాబితాలోకి ఎక్కిన వారిని సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ రకాల పత్రాలు కోరటం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రక్రియ సారాంశం. దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకు ముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పించాలి.
జూలై 1, 1987– డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు ఈ పత్రాలతో పాటు తల్లితండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత జన్మించిన వారు తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు తల్లితండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. లేనట్టయితే జాబితాలో చోటుండబోదని ఈసీ ప్రకటించింది. సుప్రీంకోర్టు జోక్యంతో చివరకు ఆధార్‌ను చేర్చారు.
ఆగస్టు 1న ప్రకటించిన తొలి ముసాయిదా జాబితా ఓటర్ల సంఖ్యను 7.24 కోట్లుగా ప్రకటించినప్పుడు విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ధర్మాసనం సూచన అమలు చేసి తాజాగా ప్రకటించిన ముసాయిదాలో కూడా సంశయాలు తప్పలేదు. 2020 జూలైలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ – జనాభా జాతీయ కమిషన్ సంయుక్తంగా విడుదల చేసిన జనాభా అంచనా నివేదిక ప్రకారం బిహార్‌లో 18 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న జనాభా 8.18 కోట్లు. తాజా ఓటర్ల జాబితా గమనిస్తే ఇందులో 76 లక్షలమంది ఓటర్లుగా నమోదు చేసుకోలేదనుకోవాలి.
అయిదేళ్లనాటి కేంద్ర నివేదిక కేవలం అంచ నాయే అనుకున్నా తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలోని సంఖ్య దానికి దరిదాపు ల్లోనైనా ఉండొద్దా? ఈసీ తీరుపై సంశయాలు వ్యక్తం కావటానికి మరో కారణముంది. సెప్టెంబర్ 1న గడువు ముగిసే సమయానికి ఓటర్ల జాబితాలో చేర్చమంటూ తమకు 16.93 లక్షల దరఖాస్తులు అందాయని సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇకపై దరఖాస్తులు స్వీకరించేది లేదని కూడా చెప్పింది. మరి 21.53 లక్షలమంది కొత్త ఓటర్లు చేరారని ఇప్పుడెలా ప్రకటించారు? సెప్టెంబర్ 1 తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారనుకోవాలా?
రెండింటి మధ్యా వ్యత్యాసం ఏకంగా 4.60 లక్షలుంది. మరి సంశయాలు రావా? దీనిపై వివరణనివ్వొద్దా? ఆ సంగతలా ఉంచి తొలగించిన 47 లక్షలమందిలో ఏయే కారణాలతో ఎంతమందిని తొలగించారన్న డేటా లేదు. ఈసీ అనుమానించినట్టు వాస్తవంగా ‘విదేశీయులు’గా ముద్రపడిన వారెందరు? ‘అనర్హులైన ఓటర్లు’గా పరిగణించి 3.66 లక్షలమందిని తొలగించామన్నారు. వీరంతా ‘విదేశీయులు’ అనుకోవాలా? ఏ పత్రమూ దాఖలు చేయలేని వారి మాటేమిటి? ఇక మృతులు, శాశ్వతంగా వలసపోయినవారు,రెండుచోట్ల నమోదైనవారు ఎందరన్న వర్గీకరణ కూడా లేదు. జిల్లాలవారీ డేటా సైతం ఇవ్వలేదు. పట్నా జిల్లాలో ఓటర్ల సంఖ్య 1.63 లక్షలు పెరిగిందని అక్కడి జిల్లా పాలనాయంత్రాంగం చెప్పింది. ఇతర జిల్లాల్లో తగ్గిందని చెప్పటం తప్ప వాటి వివరాలు లేవు.
ఇది ఇక్కడితో ఆగిపోదు. తొలగించిన పేర్లు, కొత్తగా చేర్చిన పేర్లు విపక్షాలు జల్లెడపట్టి ఈసీ ప్రకటించిన తుది జాబితా దుమ్ము దులుపుతాయి. దేశమంతటా ‘సర్’ అమలు చేస్తామని సంబరంగా ప్రకటించటం కాదు... బిహార్‌లో తలెత్తుతున్న సందే హాలకు ఈసీ సమాధానం చెప్పాలి. పారదర్శకంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈవీఎంలపై వచ్చిన సంశయాలను ఇంతవరకూ ఈసీ నివృత్తి చేయలేదు. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను పెంచడానికి ఏం చేయబోతున్నారో చెప్పిందీ లేదు. ఈ దశలో ఈసీ చిత్తశుద్ధిని పార్టీలైనా, ప్రజానీకమైనా నమ్మగలరా?