
సాక్షి, చెన్నై: జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక ఆధారంగా దివంగత సీఎం జే జయలలిత మృతి కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌లకు శుక్రవారం మెమొరాండం సమర్పించారు. ఇందులో 2016లో జయలలిత ఆస్పత్రిలో చేర్చడం, ఆమె మరణం గురించి ప్రస్తావిస్తూ, జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు.
అరుముగస్వామి కమిషన్ విచారణ
2016లో తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి జస్టిస్ ఎ. అరుముగస్వామి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణ అనంతరం 2022 ఆగస్టు 27న నివేదిక సమర్పించింది. అనంతరం 2022,అక్టోబర్ 17న ప్రభుత్వం ఒక జీవోను జారీ చేస్తూ, కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.
‘వీరందరినీ విచారించాలి’
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆస్పత్రిలో చికిత్స అందించడంలో తీవ్ర లోపాలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది. ఈ మేరకు వీకే శశికళ, డాక్టర్ కె.ఎస్. శివకుమార్, డాక్టర్ జె. రాధాకృష్ణన్ (అప్పటి ఆరోగ్య కార్యదర్శి), డాక్టర్ సి. విజయభాస్కర్ (అప్పటి ఆరోగ్య మంత్రి)లను విచారించాలని సూచించింది. అలాగే డాక్టర్ వై.వి.సి.రెడ్డి, డాక్టర్ బాబు అబ్రహాం, డాక్టర్ రామమోహనరావు (అప్పటి ముఖ్య కార్యదర్శి)ల పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని సిఫారసు చేసింది. దీనికితోడు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డిని విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉందని కమిషన్ పేర్కొంది.
‘క్రిమినల్ చర్యలు ప్రారంభం కాలేదు’
రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి చట్టపరమైన లేదా క్రిమినల్ చర్యలు ప్రారంభం కాలేదని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ అరుముగస్వామి కమిషన్ సిఫారసుల ప్రకారం సీబీఐ వెంటనే దర్యాప్తు చేపట్టాలని, తమిళనాడు ప్రభుత్వం అవసరమైన పత్రాలను సీబీఐకి అందజేయాలని కోరారు. జయలలిత చనిపోయిన తరువాత 75 రోజుల పాటు హాస్పిటల్ లో జరిగిన అన్ని ఘటనల ఆధారంగా వివిధ అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆ తరువాతనే అరుముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేశారని, జయలలిత మరణంపై ఉన్న అనుమానాలు ఇప్పటివరకు నివృత్తి కాలేదని, తగిన న్యాయం జరగలేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి, చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.