
ఆమె అతన్ని ప్రేమించింది. అతను ఆమెతో పాటు మరో యువతినీ ప్రేమించాడు. ఈ క్రమంలో రెండో గర్ల్‌ఫ్రెండ్ వ్యవహారం మొదటి గర్ల్‌ఫ్రెండ్‌కు నచ్చలేదు. ఆమెతో తిరగడం ఆపేయాలంటూ ప్రియుడ్ని వారించింది. దానిని సీరియస్‌గా తీసుకున్న ఆ యువకుడు.. ఎలాగైనా మొదటి ప్రేయసిని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె మాత్రం అతన్ని విడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోక.. ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో యమునా నదిలో దొరికిన ‘సూట్‌కేసులో యువతి డెడ్‌బాడీ మిస్టరీ’.. రెండు నెలల తర్వాత వీడింది. తన అబద్ధాలతో రెండు నెలలపాటు పోలీసులను ఏమార్చిన యువకుడు.. చివరకు నేరం అంగీకరించాడు. రెండో ప్రేయసి కోసమే మొదటి ప్రేయసిని హతమార్చినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలనే వెల్లడించారు.
ఆగస్టు 8వ తేదీన కాన్పూర్‌కు చెందిన అకాంక్ష(18) అనే యువతి కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి బర్రాలోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తుందని తెలుసుకున్న పోలీసులు.. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడి(20)తో వెళ్లిపోయిందని భావించారు. ఈ క్రమంలో..
అతన్ని విచారణ జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె తనతో చాలా రోజుల నుంచి టచ్‌లో లేదంటూ ఆ యువకుడు చెప్పాడు. అయితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది నిజమేనని ధృవీకరించుకున్న పోలీసులు.. మళ్లీ అతగాడ్ని తమైమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది.
ఆకాంక్ష తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. హనుమంత్ విహార్‌లో ఓ గదిని అద్దెను తీసుకుని జీవించసాగింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు మరో అమ్మాయితోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలుసుకుని నిలదీసింది. తప్పు జరిగిపోయిందంటూ ఆమెను బతిమాలి కూల్ చేశాడా యువకుడు. అయినప్పటికీ మరో యువతితో అతని బంధం కొనసాగింది. ఈ క్రమంలో..
జరిగిన విషయాన్ని మరో గర్ల్‌ఫ్రెండ్‌కి చెప్పగా.. అకాంక్షను అడ్డు తొలగించుకుందాం అని సూచించింది. దీంతో.. సెప్టెంబర్ 8న రెస్టారెంట్‌లో ఆ జంట మధ్య గొడవ జరిగింది. కోపంతో ఇంటికి వచ్చిన అతను ఆమెను కొట్టి, అనంతరం గొంతు నలిపి హత్య చేశాడు. హత్య అనంతరం.. ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఆపై తన స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి మోటార్‌సైకిల్‌పై బండా జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో శవం ఉన్న సూట్ కేసు పడేశారు. ఆపై రెండో గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి.. ఆమెతో జాలీగా గడిపాడు.
మొదట పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన నిందితుడు.. మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులతో దొరికిపోయాడు. దీంతో యువకుడిని, ఫతేపూర్‌కు చెందిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.