హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె.అశోక్ (45) ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్‌గా పనిచే స్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లేస్కూల్ నిర్వహిస్తోంది. వేరేకాలనీ లో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమ కొన్ని సంవత్సరా లనుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో అశోక్ గతంలో భార్య ను మందలించాడు.
ఈనెల 10వ తేదీన ఇంటిముందు మహేశ్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా గైనా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేశ్, పూర్ణిమ పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేశ్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి అశోక్‌కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురూ మూకుమ్మడిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్లు పట్టుకోగా, ప్రియుడు, మరోవ్యక్తి మెడకు మూడు చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు.
అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి, అంబులెన్స్‌లో అశోక్‌ను మల్కాజిగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. వాష్‌రూంలో హార్ట్ ఎటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. ఆసుపత్రి సిబ్బంది మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు, మరోవ్యక్తి సాయంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు మహేశ్‌తోపాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


