
సాక్షి,చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కరూర్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టే బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఆ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీం నియమించింది.
అయితే, విజయ్ (Vijay) ఇప్పటి వరకు నిర్వహించిన బహిరంగ సభల్లో అధికార, గత పాలకుల అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో విజయకు మద్దతు ఎవరిస్తారు? విజయ్ మద్దతు ఎవరికుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం విజయ్‌కు విశ్వాసపాత్రులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు తమిళనాడు తిరుచ్చికి చెందిన అధవ్ అర్జున్ రెడ్డి. ఈయన దేశంలో లాటరీ కింగ్ పేరు పేరొందిన మార్టిన్ అల్లుడే ఈ అర్జున్ రెడ్డి. ఎలక్టోరల్ బాండ్స్ కోసం రూ. 1318 కోట్లు ఇచ్చి దేశంలో అగ్రగామిగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన డీఎంకేకి మద్దతు ఇచ్చారు. ఇంకొకరు ఆనంద్, విజయ్ ఫాన్స్ అసోసియేషన్ తరపున పుదుచ్చేరి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. వారిద్దరు విజయ్‌కు విశ్వాస పాత్రులుగా ఉంటూ టీవీకే (TVK) కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు.
ఇక తాజా, సుప్రీంకోర్టు నిర్ణయంతో విజయ్ త్వరలో జిల్లాల పర్యటన ఉండనుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలతో విజయ్.. ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా? లేదంటే ప్రశాంత్ కిషోర్ (prashant kishor) సూచనలు మేరకు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగతాడా? అన్నది తేలాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే!