breaking news
Kethireddy jagadeeswara reddy
-
విజయ్ టీవీకే పార్టీలో కీలక వ్యక్తులు తెలుగువారే
సాక్షి,చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కరూర్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టే బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఆ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీం నియమించింది. అయితే, విజయ్ (Vijay) ఇప్పటి వరకు నిర్వహించిన బహిరంగ సభల్లో అధికార, గత పాలకుల అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో విజయకు మద్దతు ఎవరిస్తారు? విజయ్ మద్దతు ఎవరికుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్‌కు విశ్వాసపాత్రులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు తమిళనాడు తిరుచ్చికి చెందిన అధవ్ అర్జున్ రెడ్డి. ఈయన దేశంలో లాటరీ కింగ్ పేరు పేరొందిన మార్టిన్ అల్లుడే ఈ అర్జున్ రెడ్డి. ఎలక్టోరల్ బాండ్స్ కోసం రూ. 1318 కోట్లు ఇచ్చి దేశంలో అగ్రగామిగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన డీఎంకేకి మద్దతు ఇచ్చారు. ఇంకొకరు ఆనంద్, విజయ్ ఫాన్స్ అసోసియేషన్ తరపున పుదుచ్చేరి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. వారిద్దరు విజయ్‌కు విశ్వాస పాత్రులుగా ఉంటూ టీవీకే (TVK) కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇక తాజా, సుప్రీంకోర్టు నిర్ణయంతో విజయ్ త్వరలో జిల్లాల పర్యటన ఉండనుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలతో విజయ్.. ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా? లేదంటే ప్రశాంత్ కిషోర్ (prashant kishor) సూచనలు మేరకు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగతాడా? అన్నది తేలాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
‘ఐ బొమ్మ’పై ఫైర్ అయిన నిర్మాత
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ( IBomma)పై సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటం (2023లో చేసిన ఒక X పోస్ట్) గురించి ప్రస్తావిస్తూ – ‘సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదు. దొంగ పనులు చేసే వారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయి. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. విచారణలో తెలిసిన వివరాలు సినీ రంగానికి షాక్ ఇచ్చాయి.కొన్ని సినిమాలను థియేటర్లలో కామ్‌కార్డర్ ద్వారా రికార్డు చేశారు. అంతేకాకుండా, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన యూఎఫ్ఓ(UFO), క్యూబ్(Qube)ల సైట్లను హ్యాక్ చేసి, విడుదలకు ముందే దాదాపు 120 చిత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసినట్లు బీహార్‌లోని గోపాలగంజ్కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ వాంగ్మూలంలో వెల్లడించాడు.నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్‌ను ఈ డిజిటల్ ప్రొవైడర్స్‌కి అందజేస్తారు. వీరు ఒకే కోడ్‌తో అన్ని థియేటర్లకు ప్రొజెక్షన్ కోసం అప్లోడ్ చేస్తారు. అయితే ఈ సైట్లను హ్యాక్ చేయడం వల్లే పెద్ద నష్టం జరిగింది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వలన ప్రొడ్యూసర్లు నష్టపోయారు.అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఈ డిజిటల్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం పట్ల వారు సమాధానం ఇవ్వడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం, పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతారు అని ఆయన హెచ్చరించారు. -
'కుబేర' హిట్.. నాకు చాలా సంతోషంగా ఉంది: కేతిరెడ్డి
నిర్మాత సునీల్ నారంగ్ తీసిన 'కుబేర'.. థియేటర్లలో రిలీజై జనాదరణ పొందుతున్న సందర్భంగా ఆయన మిత్రుడు, నిర్మాత-దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సునీల్ ఇంతా మంచి సినిమా తీయ్యడంతో సంతోషంగా ఉందని, చాలా రోజుల తరువాత ఓ మంచి మూవీ చూసిన అనుభూతి ప్రేక్షకులకు వచ్చిందని చెప్పారు. సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 'కుబేర' ఊరట కల్పించిందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు.'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వేసవిలో తెలుగు సినిమా మసక బారిందని, ఇప్పుడు దాదాపు ఐదారు నెలల తర్వాత కుబేర సినిమాతో కాస్త జనం థియేటర్లకు రావటం చూస్తుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి చిత్రాన్ని ఆదరిస్తారనే విషయం మరోసారి తేటతెల్లం అయ్యిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమ.. ప్రేక్షకుడి అభిరుచిని గుర్తెరిగి మంచి సినిమాలను నిర్మించాలని.. అప్పుడే ప్రేక్షకులు ఓటీటీలకు కాకుండా థియేటర్ల వైపు వస్తారని కేతిరెడ్డి తెలిపారు. -
నన్ను గెలిపిస్తే.. తెలుగోడి శక్తిని తెలియజేస్తా!
తమిళనాడు: తమిళనాడులో జయలలిత పోటీచేస్తున్న ఆర్కె నగర్, హోసూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆయన జయలలితకు ప్రత్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఆర్కె నగర్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉండగా, హోసూరులో ఒక లక్ష ఎనభై వేలమంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందంటూ ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటనలో అభ్యర్థించారు. తమిళనాడు రాజకీయ పార్టీల ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా తెలుగు ప్రజలను కోరారు. తమిళనాడులో ద్విభాషా విద్యావిధానం అమలులో ఉందని, దీనికి బదులుగా త్రిభాష విద్యా విధానం అమలు చేయాలని, ఉగాది పండుగను ప్రభుత్వ పండుగగా ఘనంగా నిర్వహించుకోవాలని కేతిరెడ్డి చెప్పారు. తమిళనాడులో అన్నీ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 35 మంది శాసన సభ్యులు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అయితే తెలుగు వారి సమస్యలపై వారు ఏనాడు స్పందించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకుంటే తెలుగు వారి సమస్యలపై పోరాటం చేస్తానని.. తెలుగు వాడి శక్తిని పాలకులకు తెలియజేస్తానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు ఓటర్లకు పిలుపునిచ్చారు.