
పైరసీకి కారణమైన సర్వీస్ ప్రొవైడర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ( IBomma)పై సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటం (2023లో చేసిన ఒక X పోస్ట్) గురించి ప్రస్తావిస్తూ – ‘సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదు. దొంగ పనులు చేసే వారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ అనే వెబ్‌సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయి. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. విచారణలో తెలిసిన వివరాలు సినీ రంగానికి షాక్ ఇచ్చాయి.
కొన్ని సినిమాలను థియేటర్లలో కామ్‌కార్డర్ ద్వారా రికార్డు చేశారు. అంతేకాకుండా, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన యూఎఫ్‌ఓ(UFO), క్యూబ్(Qube)ల సైట్లను హ్యాక్ చేసి, విడుదలకు ముందే దాదాపు 120 చిత్రాలను నేరుగా డౌన్‌లోడ్ చేసినట్లు బీహార్‌లోని గోపాలగంజ్‌కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ వాంగ్మూలంలో వెల్లడించాడు.
నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్‌ను ఈ డిజిటల్ ప్రొవైడర్స్‌కి అందజేస్తారు. వీరు ఒకే కోడ్‌తో అన్ని థియేటర్లకు ప్రొజెక్షన్ కోసం అప్‌లోడ్ చేస్తారు. అయితే ఈ సైట్లను హ్యాక్ చేయడం వల్లే పెద్ద నష్టం జరిగింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వలన ప్రొడ్యూసర్లు నష్టపోయారు.
అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఈ డిజిటల్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం పట్ల వారు సమాధానం ఇవ్వడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం, పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతారు అని ఆయన హెచ్చరించారు.