పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేశారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్‌కి సినీ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వందలాది మంది కష్టం సినిమా. అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది అడిగారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు రిటైర్ పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు.
పైరసీ అరికట్టేందుకు ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసి పైరసీ సెల్ ఎంతో కృషి చేసింది. ఇక్కడే కాదు విదేశీ సినిమాల విషయంలోనూ పైరసీని అరికట్టేందుకు ఈ విభాగం ఎంతో పని చేసింది. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ దేశాలకు చెందిన సినీ పెద్దలను పైరసీ సెల్‌ని అభినందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘ఐబొమ్మ’ వాళ్లను పట్టుకోవడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు డిపార్ట్‌మెంట్‌కి టాలీవుడ్ తరపున ధన్యవాదాలు. పైరసీ అరికట్టడంతో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తాం’ అన్నారు.
ఫిలిం చాంబర్ అధ్యక్షకులు భరత్ భూషన్ మాట్లాడుతూ.. ‘ఛాంబర్ కు సంబంధించిన వీడియో పైరసీ సెల్ కూడా పైరసీకి అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుంది. పైరసీ చేస్తున్న వాళ్ళను అరెస్ట్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి , సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు’ అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... " పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలను పైరసీలో చూస్తున్నారు అంటున్నారు. కానీ ఈ పరిస్థితి వల్ల మిగతా చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సంగతి అర్థమవుతుంది. వారి సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలి" అని అన్నారు.
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... "సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. అది టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్‌గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చి చూసే విధంగా టికెట్ ధరలు ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు" అని అన్నారు.


