మానవ జీవితంలో వివాహ బంధం చాలా ప్రవిత్రమైంది. అది అందంగా అమరడం ఒక వరం. పెళ్లి అనేది కొందరికి సరైన సమయంలో జరుగుతుంది. మరి కొందరికి కొంచెం ఆలస్యం కావొచ్చు. అయితే 99 శాతం మందికి జీవితం వివాహబంధంతో పరిపూర్ణం అవుతుంది. ఇకపోతే తమిళ నటి జూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. సుమారు ఏడేళ్ల క్రితం చెన్నై మెరినా బీచ్ వద్ద జరిగిన జల్లికట్టు పోరాటంలో గొంతు కలిపి జూలీ పాపులర్ అయింది. మొదట ఆమె ఒక సాధారణ నర్సు.. జల్లికట్టు ఉద్యమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో తమిళ బిగ్‌బాస్-1 షోలో ఛాన్స్ రావడం అలా మరింత గుర్తింపు పొందారు.
బిగ్‌బాస్ నుంచి బయటకువచ్చిన తరువాత సినిమా రంగం ఆహ్వానం వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించిన జూలీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయ్యారు. ప్రముఖ మోడల్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి జూలీకి ఇప్పుడు కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లో, ప్రేమ వివాహమో తెలియదుగానీ, మహ్మద్ జక్రీమ్ అనే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు.
వీరిద్దరూ బిగ్‌బాస్ గేమ్ షోలో కలిసి పాల్గొన్నారన్నది గమనార్హం. వీరి నిశ్చితార్థం వేడుక ఇటీవల జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జూలీ, మహ్మద్ జాక్రీన్‌ల వివాహం ఈ నెల 16వ తేదీ ఉదయం చైన్నై, సెంథామస్‌లోని సెయింట్ పేట్రిక్ చర్చిలో జరగనుంది. అదే రోజు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ జరగనుందని తెలిసింది.


