పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటోంది ప్రముఖ నటి రోహిణి. మనం పాటించే మంచి అలవాట్లను వారు కూడా అనుసరించేలా చూడాలని చెప్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో రోహిణి పాల్గొంది. ఈ సందర్భంగా తనను కన్నది తెలుగు తల్లి అయితే పెంచింది తమిళ తల్లి అని పేర్కొందిం.
చిన్నప్పటి నుంచే..
ఆమె ఇంకా మాట్లాడుతూ... సమాజం నాకు స్త్రీ పాత్ర ఇచ్చింది. స్త్రీ అంటే మగాడికన్నా తక్కువ.. వాళ్లంత చదవనవసరం లేదు, వాళ్లకున్న హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సమానత్వం లేదని తెలిసింది. చిన్నప్పటినుంచే ఇలా కూర్చోవాలి, వంట చేయాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి అని చెప్తారు. ఇంకొకరి ఇంటికి వెళ్లినప్పుడు మా పేరు నిలబెట్టాలని తల్లిదండ్రులు చెప్తుంటారు. కొడుక్కి మాత్రం.. ఈ పని చేయొద్దు, ఆడదే చేస్తుంది అని అమ్మ చెప్తుంది.
జీతాల్లేని శ్రామికులం
అలా కాకుండా.. మీ ఇద్దరూ కలిసి పనిచేయాలిరా అని అమ్మ చెప్పి పెంచితే ఎంత బాగుంటుంది. సమాజంలోని ఎన్నో విషయాలను సరిచేసే శక్తి మహిళకు ఉంది. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే ఆడవాళ్ల గురించి పట్టించుకోవాలి. మనం జీతాల్లేని శ్రామికులం. పుట్టుకతోనే శ్రామికులం. అన్నం ఎవరు వండినా ఉడుకుతుంది. ఆడదాని చేత్తో వండితేనే అన్నం అవుతుందా? అబ్బాయిలకు కూడా అన్నీ నేర్పండి.
మా అబ్బాయికి కూడా..
సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. దీనివల్ల యువత పక్కదారి పడుతుంది. ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి. బట్టలు వేసుకునే బయటకు వెళ్లాలి.. ఒంటిపై డ్రెస్ లేకుండా వెళ్లకూడదని పిల్లలకు చిన్నప్పుడే చెబుతున్నాం.. దాన్ని అలవాటు చేశాం. ఇక్కడ ఆడవాళ్లం చీరలు కట్టుకుంటాం. లండన్‌లో షార్ట్స్, స్కర్ట్స్,గౌన్ వేసుకుంటారు. మన అలవాట్లనే పిల్లలకు నేర్పించి మంచిదోవ పట్టించాలి. మా అబ్బాయికి కూడా అదే చెప్తుంటాను. చెడు అలవాట్ల వల్ల వచ్చే కష్టనష్టాలను చెప్పి దానిజోలికి వెళ్లకుండా చూసుకోవాలి అని రోహిణి చెప్పుకొచ్చింది.


