పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరి చేయి మరొకరు జీవితాంతం విడవమని చెప్తుంటారు. కానీ ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతోంది. చాలామంది దంపతులు కొన్ని నెలలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మలయాళ బుల్లితెర జంట మను వర్మ- సింధు వర్మ ఈ కోవలోకే వస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.
మళ్లీ కలిసే ప్రసక్తే లేదు
ఈ విషయం గురించి మను వర్మ మాట్లాడుతూ.. నేను, నా భార్య కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నాం. చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కానప్పటికీ మేము మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. మళ్లీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం, ఆలోచన ఎంత మాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్నవాళ్లు, జంటగా కలిసున్నవాళ్లు కూడా విడిపోయిన సంఘటనలు కోకొల్లలు.
లోపించిన సఖ్యత
మూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కలిసిమెలిసున్నాం. కానీ కొంతకాలానికే అంతా రివర్స్ అయిపోయింది. మా మధ్య సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసుండటం కన్నా విడివిడిగా జీవించడమే మంచిది. విదేశాల్లో దంపతులు విడిపోయినా వారి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది కేరళలోనూ అవలంబిస్తే బాగుంటుంది.
ముగ్గురు పిల్లలు
ఇక్కడ విడిపోయిన జంట మళ్లీ తారసపడ్డారంటే ఒకరిని మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీయడానికే ప్రయత్నిస్తుంటారు. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దవాడు అమెరికాలో ఐటీ ఇంజనీర్ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. మాకో కూతురుంది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయి అని చెప్పుకొచ్చాడు.
సీరియల్స్, సినిమా
దివంగత నటుడు జగన్నాథ వర్మ కుమారుడే మను వర్మ. మను వర్మ.. కాదమట్టతు కథనార్, పోక్కాలం వరవై, కుంకుమచెప్పు వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. అలాగే మమ్ముట్టి 'నీలగిరి', జయరామ్ 'నరనాతు తంపురాన్' సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. సింధు వర్మ విషయానికి వస్తే ఎటో జన్మ కల్పనయిల్, పంచాంగి వంటి సీరియల్స్ చేసింది. మమ్ముట్టి 'సీబీఐ 5: ద బ్రెయిన్', 'అర్థం' చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.
చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు: నటికి ఆఫర్


