ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్(The Raja Saab) ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.

‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్ హిట్ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్ వస్తే.. వాళ్లకు అది ఫుడ్ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు.

ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్ వచ్చినా..ఫ్లాప్ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు.


